ఉమ్మడి పాలమూరులో కరోనా టెన్షన్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 10
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా జాడలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ వెలుగుచూస్తున్నాయి. ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చేస్తోన్న విశ్వప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఇద్దరికి కరోనా నిర్ధారణ కావడం.. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ఒకే కుటుంబానికి నలుగురు గాంధీ ఆస్పత్రి తరలించడం.. ఇటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పదకొండు మంది రక్త నమూనాలు నిర్ధారణ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించడం లాంటి పరిణామాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో ప్రజలకు వివరించలేని అధికారులు.. తెలుసుకోలేని పరిస్థితుల్లో జనం ఉన్నారు. కరోనాపై అవగాహన కల్పించడంలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం జిల్లాలో పరిస్థితి తీవ్రతనూ ప్రజలకు వివరించడంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. జడ్చర్లలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని సంబంధిత అధికారులు ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆ ప్రాంతంలో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన ఓ వృద్ధుడు రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురై..చనిపోయాడు. ఒక రోజు ఆలస్యంగా విషయం తెలుసుకున్న వైద్యాధికారులు మృతుడి కుటుంబసభ్యులు నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గద్వాలకు చెందిన మరో 13 మంది మృతుడితో పాటు ఢిల్లీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే గద్వాలలో ఒంటలిపేటకు చెందిన ఓ యువకుడిని సోమవారం రాత్రి ఐసోలేషన్‌కు తరలించారు. ఇటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లిన పదకొండు మంది రక్తనమూనాలు గాంధీ ఆస్పత్రికి తరలించడం కలకలం రేపుతోంది. మరో పక్క.. శంషాబాద్ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన జడ్చర్లకు చెందిన ఉద్యోగితో పాటు అతని తల్లికీ కరోనా నిర్ధారణ కావడం..వారిని గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచడం జిల్లాలో కలకలం రేపుతోంది. ముందు జాగ్రత్తగా అతని కుటుంబసభ్యులనూ అధికారులు హోం క్వారంటైన్‌లోనే ఉంచారు. ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అయితే.. కరోనా నిర్ధారణ అయిన విషయాలను అధికారులు అధికారికంగా ప్రకటిస్తే అనవసరంగా రోడ్లపైకి వస్తోన్న జనం ఇళ్లకే పరిమితమయ్యే అవకాశాలూ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పదే పదే ప్రజల మధ్య భౌతిక దూరం గురించి ప్రస్తావిస్తున్నా మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలు మా త్రం వారి మాటలను పెడచెడిన పెడుతున్నారు. ఉదయం 6గంటల నుంచి పది గంటల వరకు కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లొచ్చని చెప్పడంతో జనమంతా ఒకేసారి రోడ్లపైకి వస్తున్నారు. అయితే మహబూబ్‌నగర్‌లో మాత్రం ఈ పరిస్థితి మధ్యాహ్నం వ రకూ కని్పస్తోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మూతబడినా జనం అక్కడక్కడా రోడ్లమీదనే దర్శనమిస్తున్నారు.అయితే అధికారులు ఉదయం బయటికి వెళ్లే వెసులుబాటు కల్పిస్తే.. హెల్మెట్లు లేవంటూ జరిమానాలు విధిస్తోన్న పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వ స్తోన్న వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదనే చెప్పవచ్చు. రోడ్లపైకి జనాన్ని రాకుండా కట్టడి చేయడాన్ని మరిచి ట్రా ఫిక్ నిబంధనలపై దృష్టి పెడుతుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి లాకౌట్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.