న్యూయార్క్ లో తగ్గుముఖం పట్టిన కరోనా
న్యూయార్క్, ఏప్రిల్ 10
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి వల్ల ప్రాణాలు కోల్పోగా.. బాధితుల సంఖ్య 16 లక్షలు దాటింది. దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 95,700 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 16.03 లక్షలు దాటింది.గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది మృతిచెందగా, ఒక్క అమెరికాలోనే 2,000 మంది చనిపోయారు. ఈ మహమ్మారి బారినపడ్డవారిలో 3.56 లక్షల మంది కోలుకోవడం శుభపరిణామం. మరో 10.10 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 49,900 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. కోవిడ్-19 దెబ్బకు ఐరోపా ఖండం చిగురుటాకులా వణుకుతోంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ ఐదు దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 60వేల మంది బలయ్యారు.ఇటలీలో 18,279 మంది, స్పెయిన్‌లో 15,447 మంది, ఫ్రాన్స్‌లో 12,210 మంది, బ్రిటన్‌లో 7,978 మంది, జర్మనీలో 2,600 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు కూడా లక్షల్లోనే ఉన్నారు. అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.68 లక్షలకు చేరుకోగా, 16,691 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లో 6,000 మంది చనిపోయారు. కరోనా వైరస్ తీవ్రత వల్ల న్యూయార్క్‌లో ఎక్కువ మంది చనిపోయారు. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చినపుడు 2,400 మంది చనిపోతే కరోనా వల్ల ఇప్పటికే ఆరువేల మందికి పైగా మరణించారు.గతంలో ఆస్పత్రుల్లో చేరిన వారిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కొత్తగా ఐసీయూ చికిత్స పొందేవారు, ఆసుపత్రుల్లో చేరేవారు తగ్గారు. చాలా మంది వైద్యులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా సోకే వారి సంఖ్య గత మూడు రోజులుగా పైపైకి వెళ్లకపోవడం ఊరట కల్గించే పరిణామం.వైరస్ తొలుత వెలుగుచూసి చైనాలో మరోసారి మహమ్మారి జడలు విప్పుకుంటోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారిలోనే కోవిడ్-19 నిర్ధారణ అవుతోందని, స్థానిక కేసులు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌లో 4,110, బెల్జియంలో 2,523 మంది, నెదర్లాండ్‌లో 2,396 మంది, స్విట్జర్లాండ్‌లో 948, బ్రెజిల్‌లో 954 మంది, టర్కీలో 908 మంది, స్వీడన్ 793 మంది, ఐర్లాండ్ 264, డెన్మార్క్ 237, పోలెండ్ 174, రష్యాలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలోనూ 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.