YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అన్ని వాళ్లకేనా..!

అన్ని వాళ్లకేనా..!

వ్యవసాయ రాయితీ ట్రాక్టర్ల పంపిణీలో నేతల మాటే వేదంగా మారింది. రైతు మనోడా.. మన పార్టీకి సంబంధించినోడా.. అయితే చాలు రాయితీ ట్రాక్టర్‌ ఇచ్చేయాలని సిఫారసు చేస్తున్నారు. అధికారులు ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక జీ హుజూర్‌ అనాల్సి వస్తోంది. ఎంపిక కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీ ఉన్నా నిమిత్తమాత్రంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రాపకం లేక ట్రాక్టర్‌ రాక సామాన్య రైతులు నిరాశకు గురవుతున్నారు.  రైతుల చేన్లలో దుక్కిదున్నేందుకు, పంట దిగుబడులు మార్కెట్‌కు తరలించేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పత్తి రైతులు విత్తనాలు నాటే సమయంలో పత్తికట్ట తీసేందుకు ట్రాక్టర్లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. కొందరు రైతులు ఇంటవద్ద నిల్వచేసే పేడ, ఇతర సేంద్రీయ ఎరువులను ట్రాక్టర్‌ ద్వారానే పంటచేన్లలో వేసేందుకు వినియోగిస్తుంటారు. ఇలా రైతుకు ప్రస్తుతం ట్రాక్టర్‌ తప్పనిసరిగా మారింది. దీనివల్ల సమయం కలిసిరావడంతోపాటు రైతు శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం ట్రాక్టర్‌లేని అయిదెకరాల రైతు అత్యవసర వ్యవసాయ పనులకోసం దాదాపుగా రూ.30వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వీటిన్నంటిని దృష్టిలో ఉంచుకొని రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపేందుకు ప్రభుత్వం రైతులకు రాయితీ ట్రాక్టర్లను పంపిణీ చేస్తోంది. కాని ఇక్కడ రాజకీయ జోక్యంతో బడారైతులు, నేతలకు నచ్చిన వారికే ఈ వాహనాలు దక్కుతుండడం విమర్శలకు తావిస్తోంది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాలకు కలిపి 87 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు ట్రాక్టర్‌ యూనిట్‌కు అర్హులు. ఇందులో మూడు రకాలుగా విభజించారు. ట్రాక్టర్‌ వ్యయం తక్కువగా ఉంటే 50శాతం రాయితీ స్తారు. ట్రాక్టర్‌ ధర ఎంత ఎక్కువగా ఉన్నా రూ.3.50 లక్షల వరకు మాత్రమే రాయితీ కింద చెల్లిస్తారు. ఆంధ్రాబ్యాంకు, మహారాష్ట్ర, ఏడీసీసీ, దక్కన్‌గ్రామీణ తదితర బ్యాంకులకు రుణాలను కేటాయించారు. రాయితీ పోను మిగితాది బ్యాంకు రుణంగా ఉంటుంది. దీనికోసం రైతు సదరు బ్యాంకు నుంచి రుణమిస్తున్నట్లు హామీ పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

ట్రాక్టర్లు మంజూరయ్యాయని తెలియడమే ఆలస్యం అధికార పార్టీ కార్యకర్తలు తమకు రాయితీ ట్రాక్టర్‌ ఇప్పించాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు ప్రారంభించారు. కొన్నిచోట్ల కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ట్రాక్టర్‌ ఇప్పిస్తామని చెప్పి ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.50వేల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధులు తమ పార్టీ అనుయాయుల ద్వారా వచ్చిన రైతుల పేర్లను ఎంపికచేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి గ్రామసభల ద్వారా రైతులను ఎంపికచేయాలి. గ్రామ సభ తీర్మానాన్ని మండల స్థాయిలోని తహసీల్దార్‌, ఎంపీడీఓలు, ఏఓల ఆధ్వర్యంలో ఉండే కమిటి ఆమోదిస్తే దాన్ని జిల్లా కమిటీకి పంపించాలి. కాని ఎక్కడా గ్రామసభలు నిర్వహించలేదు. దీంతో రైతులు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అసలు ఎంపిక ఎలా ఉంటుందనేది రైతులకు తెలియదు. జిల్లాస్థాయిలో జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌, ఆగ్రోస్‌ ఆర్‌ఎం, ఏరువాక శాస్త్రవేత్త కమిటీలో సభ్యులుగా ఉంటారు. మండల కమిటీ నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. కాని అసలు దరఖాస్తులే రాకపోవడంతో లబ్ధిదారులను ఎంపిక ఎలా చేస్తారనేది ఇక్కడ ప్రశ్న.

నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పంపిన రైతు జాబితాకే అధికారులు ఆమోద ముద్ర వేస్తున్నట్లు తెలిసింది. మార్చి 31 వరకే గడువు ఉండడం.. ఒకేరోజు సమయం ఉండడంతో నేతల నుంచి వచ్చిన జాబితాలో రైతుల పేర్లు పరిశీలించి ఎవరైనా బ్యాంకుల్లో బకాయిలుంటే వెంటనే చెల్లించాలని అధికారులు వారికి చరవాణిలో చెబుతున్నట్లు తెలిసింది.

Related Posts