పశ్చిమ గోదావరి జిల్లాలో పాడి పంటలతో పాటు సహజ వనరులూ పుష్కలంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతమైన దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లో నల్లరాతి గనులు, ద్వారకాతిరుమల, గోపాలపురం మండలాల్లో సుద్ద, ఇసుక రాతి గనులు ఉన్నాయి. స్థానిక సంస్థలకు ఆదాయ వనరులుగా ఉపయోగపడాల్సిన ఈ గనులను అక్రమార్కులు మింగేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిపి భారీగా తరలించేస్తున్నారు.
గోపాలపురం మండలం భీమోలు, రాంపాలెం, గోపవరం గ్రామాల పరిధిలో సుద్దరాయి గనులు ఉన్నాయి. వీటిలో కొంతమేర సుద్ద, ఇసుక మిశ్రమంగా ఉంటే రాతి పొర ఉంటుంది. ఈ రాళ్లను అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లోనూ ఏడు చోట్ల క్వారీలున్నాయి. అన్నిచోట్లా తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో అనుమతి మాత్రం ఒక్కదానికే ఉంది. అదికూడా ఈ ఏడాది మార్చి 5 నుంచి 31 వరకు సుద్దరాయిని తవ్వుకునేందుకు భూగర్భగనులశాఖ అధికారులు తాత్కాలికంగా అనుమతిలిచ్చారు. కానీ ఇక్కడ దాదాపు అయిదేళ్లనుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు ఈ భూముల యజమానులైన రైతులకు కొంతమేర సొమ్ము ముట్టజెప్పి తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ లభ్యయమ్యే రాయిని లారీకి రూ.6 వేల నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది
ఇక్కడ లభ్యమవుతున్న రాయిని జిల్లాలో భీమవరం, నరాసాపురం, పాలకొల్లు, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రాతిని కాలువలు, చెరువుల గట్ల రివిట్‌మెంట్ పనులకు వినియోగిస్తున్నారు. ఈ రాయిని పూర్తిగా రాత్రివేళల్లో లారీల్లో ఎగుమతి చేస్తున్నారు. ఒక్కోలోడును రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఈ ప్రాంతం నుంచి రోజుకు సగటున రూ. 5 లక్షల విలువైన రాయి తరలిపోతున్నట్లు అంచనా. అంటే నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ.18 కోట్ల విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పరమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో గనుల నుంచి భారీగా రాయి తరలిపోతుండగా స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నారు. మార్చి 22న రెండు, 27న ఒకటి చొప్పున లారీలను పట్టుకున్నారు. ఈ గ్రామాల్లో సుద్దరాయిని తరలించే లారీలు 15 వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో అయితే పట్టపగలే తరలించారు. స్థానిక అధికారులు తనిఖీలు చేస్తుంటంతో ప్రస్తుతం రాత్రి సమయాల్లో మాత్రమే రవాణా చేస్తున్నారు. తవ్వకాలు మాత్రం పగటి పూటే జరుగుతున్నాయి. గోపాలపురం మండలంలో భీమోలు, రాంపాలెం, గోపవరం గ్రామాల నుంచి రోజుకు 10 నుంచి 50 లారీల రాయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.
శాఖల మధ్య కొరవడిన సమన్వయం సహజ వనరులను కాపాడడంలో, ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చేలా చేయడంలో సమష్టిగా పనిచేయాల్సిన ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడుతోంది. అక్రమంగా రాయి తరలిస్తున్న లారీలను తాము పట్టుకున్నా గనులశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం స్థానిక ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.