రెబల్‌స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేవి కొన్ని విభిన్నైమెన సినిమాలు, కొన్ని విలక్షణమైన పాత్రలు. అలాంటి పాత్రలు కృష్ణంరాజు మాత్రమే చెయ్యగలరు అనుకునేంతగా ఆయన అభినయం ఉండేది. తను చేసే ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేసేవారు. రౌద్రాన్ని నూటికి నూరు శాతం చూపించగల నటుడు కృష్ణంరాజు. ఆయన రెగ్యులర్ హీరో కాదు. రొటీన్‌కి భిన్నంగా ఉండే క్యారెక్టర్లని మాత్రమే ఇష్టపడేవారు. అందరూ వెళ్ళే దారి కాదు, తన దారి వేరు అని ఆయన చేసిన పాత్రలే చెప్తాయి. నెగెటివ్ క్యారెక్టర్ అయినా, పాజిటివ్ క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. ‘చిలకా గోరింకా’తో ప్రారంభైమెన కృష్ణంరాజు నట ప్రస్థానం విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆయన కెరీర్‌లో మైలు రాళ్ళుగా చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఎన్నెనో.. 'కటకటాల రుద్రయ్య', 'కృష్ణవేణి', 'రంగూన్ రౌడీ', 'అమరదీపం', 'జీవన తరంగాలు', 'కురుక్ష్రేత్రం', 'మనవూరి పాండవులు', 'త్రిశూలం', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్రపాపారాయుడు', 'ధర్మాత్ముడు', 'ఆడాళ్ళూ మీకు జోహార్లు'... చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ప్రతి పాత్ర విభిన్నంగానే కనిపిస్తుంది. సినిమాల్లోనే కాదు, రాజకీయంగా కూడా తనైదెన ముద్ర వేశారు కృష్ణంరాజు. విభిన్నమైన సినిమాలు తియ్యాలనే తపనతో గోపీకృష్ణ మూవీస్ సంస్థను స్థాపించి కుటుంబ సవేుతంగా చూడదగ్గ చక్కని చిత్రాలు నిర్మించారు. నటుడుగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తయింది. జనవరి 19 కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 50 ఏళ్ళ సినీ ప్రస్థానం గురించి ఆయన చెప్పిన విశేషాలు..
కొంతవరకు సాధించగలిగాను
నా మొదటి చిత్రం ‘చిలకా గోరింకా’. ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావుగారితో కలిసి నటించిన సన్నివేశంతో సినిమా రంగంలోకి ప్రవేశించాను. నా తొలి అడుగు రంగారావుగారితో ప్రారంభం కావడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నటనలో ఆయన శిఖర సమానుడు. ఆయన స్థాయిలో నేను నటించానని చెప్పుకుంటే అది అబద్ధమే అవుతుంది. అయితే నటనలో ఆయన్ని అందుకునే ప్రయత్నం మాత్రం చేశాను. కొంతవరకు సాధించగలిగాను. నా మొదటి సినిమాతోనే నాపై నాకు నమ్మకం ఏర్పడింది. నాలో నటుడు ఉన్నాడు, నేనూ నటించగలనన్న ఆత్మ విశ్వాసం పెరిగింది. అయితే ఆ సినిమా తర్వాత నాకు వెంటనే అవకాశాలు రాలేదు. కొంతకాలం ఖాళీగానే ఉన్నాను. అప్పుడు ‘నేనంటే నేనే’ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. అది కూడా స్టైలిష్ విలన్. ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. దాంతో వెంట వెంటనే ఓ పది సినిమాల్లో విలన్‌గా అవకాశాలు వచ్చాయి. అయితే అందులో నాకు నచ్చిన రెండు సినిమాలు మాత్రమే ఒప్పుకున్నాను. అవి కూడా పాత్ర ప్రత్యేకంగా ఉంటూ నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లనే ఎంచుకున్నాను.
తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళ్ళే ప్రయత్నం..
కొంతమంది తమ కోసం సినిమాలు చేస్తారు. మరికొంత మంది తమ కోసం సినిమాలు చేస్తూనే పరిశ్రమ అభివృద్ధికి పాటు పడతారు. ఇంకొంత మంది పరిశ్రమ కోసమే సినిమాలు చేస్తారు. ఉదాహరణగా చెప్పాలంటే రావ్‌ుగోపాల్‌వర్మ లాంటి వారు తమ కోసమే సినిమాలు చేసుకుంటారు. యం.యస్.రాజు వంటి నిర్మాతలు కేవలం ఇండస్ట్రీ కోసం సినిమాలు నిర్మిస్తారు. అలా నేను కూడా గోపీకృష్ణ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే సినిమాలు నిర్మించాను. అలా నా వంతు కృషి నేను చేశాను. అందుకే ఎవరు ఉన్నా, లేకపోయినా మా సంస్థ అలాగే కొనసాగుతోంది. ఇప్పటివరకు నేను 300 సినిమాల్లో నటించాను. మొదటి నుంచి నా తాపత్రయం ఒకటే.. రామారావుగారిలా, నాగేశ్వరరావుగారిలా రంగారావుగారిలా, కన్నాంబగారిలా, సావిత్రిగారిలా నేచురల్ యాక్టింగ్‌తో నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అలా నేచురల్‌గా పెర్‌ఫార్మ్ చెయ్యాలనే తపన నాకు వుండేది. దాంతో నా పరిధిలో నేను యాక్ట్ చేస్తూ వచ్చాను తప్ప అలాక్కాదు ఇలా తియ్యండి అని డైరెక్టర్స్‌కి ఎప్పుడూ చెప్పలేదు. దానివల్ల కొన్ని విషయాల్లో కాంప్రైమెజ్ అవ్వాల్సి వచ్చేది. మంచి సినిమాలు, మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే క్యారెక్టర్లు చెయ్యాలంటే బయటి నిర్మాతలు, దర్శకులు చేసే సినిమాల్లో సాధ్యపడకపోవచ్చు. అందుకే సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ఆ రోజుల్లో కృష్ణవేణి, మనవూరి పాండవులులాంటి కథలు చెబితే ఏ నిర్మాత ముందుకొచ్చేవాడు కాదు. కొడుకు ఊరంతా తిరిగిన విషయాన్ని గర్వంగా చెప్పుకునే తండ్రి.. కూతురు బయుటికి వెళ్తే తట్టుకోలేడు. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా పట్టించుకోడు. కూతురు చేసేది తప్పో, ఒప్పో తెలియుకపోయినా ఆమెను నిందిస్తాడు. ఇదీ సమాజం తీరు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఆ అమ్మాయి దారి సరైందా కాదా అనే అనుమానం వస్తుంది. చివరికి ఆమె నిజాయితీ ఏమిటో తెలుస్తుంది. ఇలాంటి కథతో సినిమా తియ్యడం అంటే కత్తిమీద సామే. కానీ, ఆరోజుల్లోనే మేము ఆ ప్రయత్నం చేశాం. అలాగే మహాభారతం కథను ఒక ఊరికి ఆపాదిస్తూ... ‘మనవూరి పాండవులు’ సినిమా కథను తయారుచేశారు బాపు, రమణ. ఈ కథను విన్న వేరే నిర్మాతలు సినిమా తియ్యడానికి ముందుకు రాలేదు. ఆ కథ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎంతో నేచురల్‌గా అనిపించింది. వెంటనే మా సంస్థలో ‘మనవూరి పాండవులు’ చిత్రాన్ని ప్రారంభించాం. చక్కని ప్లానింగ్‌తో కేవలం 30 రోజుల్లోనే సినిమాని పూర్తి చేయగలిగాం. సినిమా ఘన విజయం సాధించింది, 25 వారాలు ఆడి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అలా రొటీన్‌గా వెళ్తున్న తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళ్ళే ప్రయత్నం చేశాను. ఇలాంటి కథతో ఇప్పుడు సినిమా తీస్తే రిలీజ్ చెయ్యడానికి థియేుటర్లు కూడా ఇచ్చేవారు కాదేమో.
అభిమానులకు సన్మానం
ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకైమెందనే చెప్పాలి. ఎందుకంటే ‘చిలకా గోరింకా’తో ప్రారంభైమెన నా సినీ జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత 40 సంవత్సరాలుగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు. వారికి, నాతో సినిమాలు చేసిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, వారిని సన్మానించుకోవడానికి నాకు ఓ అవకాశం దొరికింది. అందుకే 50 సంవత్సరాల వేడుకను జరపాలని అనుకుంటున్నాం. కాబట్టే ఈ పుట్టినరోజున అభిమానులను కలవడం లేదు. స్వర్ణోత్సవం సందర్భంలో అందర్నీ కలవాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు వారి కుటుంబ సభ్యుల సవుక్షంలోనే సన్మానం చేసి మెమెంటో అందించాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం రెండు, మూడు నెలల్లో నిర్వహిస్తాం. ఆ సందర్భంలోనే చిత్ర పరిశ్రమలోని నా సన్నిహితులను ప్రత్యేకంగా కలుస్తాను.
‘బాహుబలి’ ఓ ఇన్‌స్పిరేషన్
‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలు వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడో గ్లోబల్ లెవల్‌కి వెళ్ళి పోయి హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మన సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాతో సమానంగా కలెక్ట్ చెయ్యడం, కొన్ని కంట్రీస్‌లో ఎక్కువ కలెక్ట్ చెయ్యడంతో చాలా మంచి పేరు వచ్చింది. ప్రపంచంలోని సినీ గోయర్స్‌లో 90 శాతం మంది ‘బాహుబలి’ సినిమాని చూశారు. దీంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి గుర్తింపు వచ్చేసింది. దాంతో మనం ఏం చేస్తున్నాం, ఏం తీస్తున్నాం అనే ఆలోచన హాలీవుడ్ డైరెక్టర్స్‌కి వచ్చింది. ఈ విషయంలో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను ఫీల్ అయ్యేది ఏమిటంటే ‘బాహుబలి’లా సినిమా తీద్దాం అని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆ స్ఫూర్తి ఉండాలి. ఎందుకంటే గ్లోబల్ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమాని నిలబెట్టేందుకు అలాంటి సినిమాలు తియ్యాలనుకోవడం చాలా గొప్ప విషయం. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఫలానా సినిమా బాహుబలి అనుకుంటున్నారు అని ఎదుటివారి సినిమా గురించి చెప్పుకుంటున్నారని తెలిసింది. అలా అనుకోకూడదా? రంగారావుగారిలా నేను యాక్ట్ చెయ్యాలనుకోవడం తప్పా? నరేంద్రమోడిగారిలా ప్రైమ్ మినిస్టర్ అయి మంచి పేరు తెచ్చుకోవాలనుకోవడం తప్పా? అది ఎంత మాత్రం తప్పు కాదు. బాహుబలిలాంటి సినిమా తియ్యాలనుకోవడం ఓ ఇన్‌స్పిరేషన్. అలా ఓ పది మంది ప్రయత్నిస్తే అందులో కొన్ని సినిమాైలెనా హిట్ అవుతాయి. అందుకే తమ సినిమా బాహుబలిలా వుండాలని కోరుకోవడంలో తప్పులేదు.
ఆ సినిమాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే..
నేను సినిమాల్లోకి వచ్చినపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో గౌరవప్రదంగా ఉంది. జాతీయస్థాయిలో చూస్తే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాలు తియ్యడంలో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేది. నేచురల్‌గా, రియలిస్టిక్‌గా పెర్‌ఫార్మ్ చేసే రామారావుగారు, నాగేశ్వరరావుగారు, ఎస్.వి.రంగారావుగారు, కన్నాంగారు.. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఫైట్స్‌తో సినిమాలు తియ్యడం మొదలుపెట్టారు. అవి ఏ స్థాయికి వెళ్ళాయంటే ఫైట్ వస్తే సిగరెట్ తాగడానికి జనం బయటికి వెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయట పడతామా అనుకుంటున్న టైమ్‌లో మళ్ళీ కొంచెం పుంజుకుంది. ఈమధ్య ఐదారు సంవత్సరాల నుంచి నిర్మాతలకు ఇబ్బంది లేకుండా సినిమాలు వస్తున్నాయి. సక్సెస్ రేట్ పెరిగింది. అలాగే ప్రొడక్షన్ కూడా పెరిగింది.
అదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం
బాహుబలి లాంటి సినిమాలు చేయాలనుకునే వాళ్లకు సాంకేతికంగా సహకరించేందుకు ఓ సంస్థను ప్రారంభించబోతున్నాం. ఇందులో బాలీవుడ్‌లో పేరున్న దర్శకుల నుంచి సాంకేతిక నిపుణులు, పేరున్న సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ప్రతిష్ఠాత్మక చిత్రాలు చేయాలనుకునేవాళ్లకు సలహాలు, సూచనలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
ఆయన సంగతి సెన్సార్ చూసుకుంటుంది
నేను కృష్ణవేణి సినిమా నిర్మిస్తున్నప్పుడు... మానభంగం చేయాల్సిన సన్నివేశంలో నటీనటులు దూరంగా ఉండాల్సి వచ్చేది. అమ్మాయిని తాకడానికి కూడా అనుమతి లేదు. కేవలం మాటలతోనే అభిప్రాయాలు తెలపాలి. అలా ఉండేవి సెన్సార్ నిబంధనలు. ఇక చారిత్రక చిత్రాల సంగతి వేరు. నేను బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చేస్తున్నప్పుడు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ పాత్రను మరింత గొప్పగా చేసి చూపించాం. కానీ.. చరిత్ర గీటు దాటలేదు. చరిత్రను తెరకెక్కించేప్పుడు దర్శకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. దేశమంతా పద్మావతి చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజపుత్ర మహారాణి వాళ్ల వంశానికి, ఆ ప్రాంతానికి ప్రతీక. ఆమె జీవిత కథతో సినిమా చేస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సినిమాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసే వాళ్లకు, సెన్సార్‌కు సంబంధం లేదు. నచ్చినట్లు సినిమాలు చేసుకునే అవకాశం అందరికీ ఉంది. అయితే ఎవరేం చేసినా చూసుకునేందుకు సెన్సార్ ఉంది. ఆ తర్వాత ఆ సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం ప్రేక్షకులకు ఉంది. అలాంటప్పుడు వర్మ శృంగార చిత్రాలు రూపొందించినా ఎందుకు భయపడాలి? ఆయన సంగతి సెన్సార్ చూసుకుంటుంది. పిల్లి.. కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదు అనుకుంటుందట. యూట్యూబ్‌లో అన్ని రకాల వీడియోలూ ఉన్నాయి. పిల్లలు వాళ్ళకి కావాల్సింది చూస్తుంటారు. వాళ్లను భయపెట్టడం కాదు వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలి.
మరోసారి మోడీ రాబోతున్నారు
గత ఎన్నికల్లో ఖరగ్‌పూర్‌లో ప్రచారం చేశాను. అక్కడ తెలుగువాళ్లు 30 శాతం ఉన్నారు. నేను వస్తున్నానని తెలిసి అంతా వచ్చారు. మీకేం కావాలి. ఏ అవసరాలు రాబోయో ప్రభుత్వం తీర్చాలి అని అడిగాను. వాళ్లు చెప్పినవి చేస్తామని మాటిచ్చాను. చరిత్ర సృష్టిస్తూ ఖరగ్‌పూర్‌లో భాజపా గెలిచింది. అలాగే వారణాసిలోనూ విజయం సాధించాం. రాబోయే ఎన్నికల కోసం నాకు కర్ణాటకతో సహా మరికొన్ని రాష్ట్రాలకు ప్రచార బాధ్యతలు ఇవ్వబోతున్నారు. వాటి గురించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈ సమయంలో సినిమాలకు కొద్ది సమయమే కేటాయించగలను. అయితే నటనకు అవకాశమున్న మంచి పాత్రలు వస్తేనే ఒప్పుకుంటాను. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో చిన్న పాత్ర నాది. కేవలం నాలుగైదు సన్నివేశాలుంటాయి. ఈ చిన్న పాత్రకు నేనెందుకయ్యా అని దర్శకుడిని అడిగితే... సార్ పాత్ర చిన్నదే కానీ మీరు నటిస్తే ఆ పాత్రతో కథ మరో స్థాయికి వెళుతుంది అన్నారు. దర్శకుడి మాటలు నచ్చాయి. చేస్తానన్నాను. అలా నన్ను సహజంగా చూపించే పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తాను. సాధారణ ఎన్నికల వేడి ఇంకా మొదలవలేదు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పరిస్థితిలో మార్పు రావొచ్చు. పార్లమెంటు సీట్లు మాత్రం భాజపా గెల్చుకుంటోంది. స్థానిక ఓట్లను మాత్రం ముఖ్యమంత్రి ఎవరు, వాళ్ల పనితీరు ఏంటన్నది ప్రభావితం చేస్తుంటుంది. దేశానికి ప్రధానిగా మరోసారి మోడీ రాబోతున్నారు. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి.
పెళ్లి మాటెత్తితే ‘సాహో’ అంటున్నాడు
గతంలో పెళ్లి మాటెత్తితే వద్దనేవాడు ప్రభాస్. ఇటీవల కాస్త మెత్తబడుతున్నాడు. బాహుబలి తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు ‘సాహో’ అంటున్నాడు. ఏమైనా పెళ్లి విషయంలో అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రభాస్ ‘సాహో’ తదుపరి సినిమా మా సంస్థలో ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.