YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సిటీలో ఆఫీస్ స్పేస్ కు తగ్గిన డిమాండ్

సిటీలో ఆఫీస్ స్పేస్ కు తగ్గిన డిమాండ్

సిటీలో ఆఫీస్ స్పేస్ కు తగ్గిన డిమాండ్
హైద్రాబాద్, ఏప్రిల్ 10  
 కోవిడ్‌ కలకలం నేపథ్యంలో నగరంలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ అనూహ్యంగా తగ్గుతోందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా ఉన్న రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరానికి ఏటా పలు దేశీయ, అంతర్జాతీయ స్థాయి బహుళ జాతి కంపెనీలు క్యూ కడతాయి. ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటుచేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దశాబ్దాలుగా వస్తున్న ఈ పరిణామం కరోనా కారణంగా తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2019)లో సుమారు పది లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ కావాలని పలు కంపెనీలు నగరానికి తరలి వచ్చాయి. ఈ ఏడాది ముగిసేనాటికి ఈ డిమాండ్‌ సగానికి అంటే ఐదు లక్షల చదరపు అడుగులకు పడిపోయే అవకాశాలున్నట్లు అంచనా వేస్తుండడం గమనార్హం. లాక్‌డౌన్‌ కారణంగా మన రాష్ట్రం, దేశంతోపాటు విశ్వవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిన విషయం విదితమే. మరో ఆరు నెలలపాటు పలు కంపెనీల విస్తరణపై ఈ ప్రభావం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీస్‌ స్పేస్‌ల అద్దెలు సైతం 10 నుంచి 15 శాతం తగ్గుముఖం పట్టే అవకాశాలుంటాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ సవిల్స్‌ ఇండియా సంస్థ తాజా అధ్యయనంలో తేలడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్‌సిటీలో ఆఫీస్‌ అద్దెలు నెలకు ప్రతి చదరపు అడుగుకు రూ.55 నుంచి రూ.65 వరకు ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలోని ఏ గ్రేడ్‌ వాణిజ్య స్థలానికి నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.75 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో వీటి అద్దెలు ప్రస్తుత తరుణంలో ఉన్న ధర కంటే సుమారు 10 నుంచి 15 శాతం మేర తగ్గుతాయని సవిల్స్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్‌ అధికంగా ఉండని కారణంగానే అద్దెలు తగ్గుముఖం పడతాయని..డిమాండ్‌..సప్‌లై సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ ఈ ఏడాది గ్రేటర్‌ పరిధిలో అనిశ్చితికి గురైనప్పటికీ వచ్చే ఏడాది పురోగమిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.కోవిడ్‌ కలకలం, లాక్‌డౌన్‌ అనంతరం సుమారు 12 నెలల పాటు నగరంలో కమర్షియల్‌ స్పేస్‌లకు డిమాండ్‌ తగ్గే సూచనలు ఉన్నాయని సెరెస్ట్రా ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ కూడా అంచనా వేస్తోంది. పలు స్టార్టప్‌ కంపెనీలు, కోవర్కింగ్‌ స్పేస్‌ అద్దెకు తీసుకునే సంస్థలు, పలు బహుళ జాతి సంస్థలు కూడా ఈ ఏడాది చివరి వరకు నూతన ఆఫీస్‌ స్పేస్‌ కోసం అన్వేషించే అవకాశాలుండవని, తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటాయని ఈ సంస్థ అంచనా వేయడం గమనార్హం. పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంకు పరిమితం చేసే అవకాశాలున్నాయని ఈ సంస్థ చెబుతోంది. అయితే రాబోయే మూడేళ్లలో నగరంలో పలు బహుళ జాతి కంపెనీలు తమ సంస్థల విస్తరణ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తాయంటూ ఈ సంస్థ తెలపడం విశేషం.

Related Posts