30 మంది కోసం వెతుకులాట
కర్నూలు, ఏప్రిల్ 11
కర్నూలు జిల్లా కరోనా పాజిటివ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా వీటి సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో అనేక హాట్ స్పాట్ లను గుర్తించారు. అక్కడ అనధికార కర్ఫ్యూను అధికారులు అమలు చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. బయటకు వస్తే కేసులు తప్పవని ఇప్పటికే పోలీసు శాఖ హెచ్చరిక జారీ చేసింది.అయితే మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇంకా తేలలేదు. గత నెల 19, 20వ తేదీల్లో వీరు అత్యధికంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లు అధికారులు అంచనా వేసుకున్నారు. దాదాపు 380 మందికి పైగానే మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లినట్లు సూత్రప్రాయంగా తెలుసుకున్న అధికారులు వీరికోసం జల్లెడ పట్టారు. దాదాపు 300 మంది వరకూ కనుగొని వారిని క్వారంటైన్ కు తరలించారు. వీరిలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.ఇక జిల్లాలోని నంద్యాల నుంచి కూడా ఎక్కువగా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. నంద్యాల లోనే వీరిని కనుగొనడం కష్టంగా మారింది. ఇంకా దాదపాు 30 మంది వరకూ జాడ తెలియడం లేదు. దీంతో నంద్యాల పట్టణంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నంద్యాల పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం అలుముకుని ఉంది. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పినా కొందరి జాడ తెలియకపోవడం కలవర పెడుతోంది.నంద్యాల మాత్రమే కాకుండా బనగానపల్లె, ఆదోని ప్రాంతాల నుంచి వెళ్లిన వారి ఆచూకీ కూడా కొందరివి లభించలేదు. దీంతో వీరు బయట తిరిగితే ఎంతమందికి కరోనాను తగిలిస్తారోనన్న ఆందోళన ఇటు ప్రజల్లోనూ, అధికారుల్లోనూ ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు సీరియస్ గా తీసుకుని మత పెద్దలతో కూడా చర్చించారు. అయినా వారి జాడ తెలియకపోవడంతో కొంత ఆందోళన అయితే ఉంది. కానీ వీరిలో కొందరు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యలో చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానం కూడా ఉంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో కరోనా కలకలం ఇప్పట్లో ఆగేటట్లు కన్పించడం లేదు.