YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆటవీ పెంపకాలు భేష్ మహారాష్ట్ర అధికారులు!!!

ఆటవీ పెంపకాలు భేష్ మహారాష్ట్ర అధికారులు!!!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కార్యక్రమాలు బాగున్నాయని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని మహారాష్ట్ర అటవీ అధికారులు చెప్పారు. కంపా పథకం నిధుల ద్వారా చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకంలో మొక్కలు బతికే శాతం పెంచే విధానాలపై  మహారాష్ట్ర అటవీ అధికారుల బృందం మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తోంది. ఇవాళ అరణ్య భవన్ లో తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఈ బృందం సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ బగీరథ, ఇతర ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున అటవీ భూమిని బదలాయిస్తోంది. దానికి బదులుగా ప్రభుత్వ భూమిని తీసుకుని హెక్టారుకు కనీసం వెయ్యి మొక్కలకు తగ్గకుండా ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టింది. వీటి ఫలితాలను అధ్యయనం చేసేందుకు, ఏ విధమైన చర్యల ద్వారా చెట్లు బతికే శాతం పెరుగుతోందనేది క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు మహారాష్ట్ర బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్టుల కోసం అటవీ భూమిని ఇస్తే, తిరిగి రివెన్యూ శాఖ నుంచి తీసుకున్న భూముల్లో ప్రత్యామ్నాయంగా చెట్లు పెంచటం, అవి లేని చోట క్షీణించిన అటవీ భూముల్లోనే అటవీ పునరుజ్జీవన చర్యలను చేపట్టిన విధానాలను తెలంగాణ అధికారులు వివరించారు. అలాగే వివిధ ప్రాజెక్టులను కేంద్రం నుంచి వేగంగా అనుమతులు సాధించటంపైన కూడా సమావేశంలో చర్చజరిగింది. అటవీ రక్షణ చట్టం ఉల్లంఘన జరగకుండా నిబంధనలకు లోబడి, ప్రభుత్వ ప్రాధాన్యతా ప్రాజెక్టుల అనుమతులకు అటవీ శాఖ సహకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  అలాగే రెండు రాష్ట్రాల్లో అటవీ భూముల రక్షణ, పచ్చదనం పెంపు, వణ్యప్రాణుల రక్షణ చర్యలపై ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం చర్చించారు. తెలంగాణకు హరితహారం మంచి కార్యక్రమం అని, కొన్నేళ్ల తర్వాత ఈ పథకం ఫలితాలు ప్రజలకు స్పష్టంగా అందుతాయని మహారాష్ట్ర అధికారులు అభిప్రాయపడ్డారు. పచ్చదనం పరిరక్షణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని, కోటి మంది సభ్యలను చేర్చించడమే లక్ష్యంగా గ్రీన్ ఆర్మీని తయారు చేస్తున్నామని, అలాగే అటవీ శాఖకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులను చేసేందుకైనా 926 పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టామని మహారాష్ట్ర అధికారులు తెలిపారు.  మహారాష్ట్ర టైగర్ రిజర్వుల్లో పులల సంఖ్య పెరగటం కోసం అక్కడి అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలు, పులుల ఆవాసం కోసం కల్పిస్తున్న చర్యలను తెలంగాణ అధికారులు తెలుసుకున్నారు. మూడు రోజుల పర్యటనల భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లాలో అటవీ శాఖ కార్యక్రమాలను పరిశీలించిన మహారాష్ట్ర బృందం, రేపు యాదాద్రి జిల్లాలో, ఎల్లుండి సిద్దిపేట జిల్లాలో పర్యటించనుంది. 

మహారాష్ట్ర బృందానికి సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ జి. సాయి ప్రకాష్ నేతృత్వం వహిస్తున్నారు. మరో ఇద్దరు సీనియర్ అధికారులు వికాస్ గుప్తా ( అదనపు అటవీ సంరక్షణ అధికారి - కంపా), బీ.ఎస్. హుడా, ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సభ్యలుగా ఉన్నారు. సమావేశంలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కే. ఝా, పీసీసీఎఫ్ లు  పృధ్వీరాజ్, రఘువీర్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, శోభ, సునీల్ కుమార్ గుప్తా, తిరుపతయ్య, కుక్రేటీ పాల్గొన్నారు.

Related Posts