బయటకు వస్తే పీడీ యాక్ట్
గుంటూరు, ఏప్రిల్ 11
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ (కోవిడ్ 19) బారినపడి మరో వ్యక్తి మృతి చెందాడు. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటికే ఓ వ్యక్తి మరణించగా.. శనివారం దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో గుంటూరు జిల్లాలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది.అలాగే గుంటూరు జిల్లాలో శనివారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 72కు చేరుకుంది. వీటిలో గుంటూరు నగరంలోనే 53 మందికి పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే నగరంలో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకింది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆదివారం జిల్లాను పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం చికెన్, మటన్ షాపులు సైతం ఉండవని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి రోజు విడిచి రోజు నిత్యావసరాల కోసం అవకాశం ఇస్తామన్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని శ్యామ్యూల్ ఆనంద్ తెలిపారు.