భారత్ అద్భుతంగా పనిచేస్తోంది
న్యూఢిల్లీ ఏప్రిల్ 11
కరోనా వైరస్ కట్టడిలో భారత్ అద్భుతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్.. తాజాగా కరోనాపై వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను క్రోడీకరించి ఒక సూచీని రూపొందించింది. వివిధ పారామీటర్లను పరిశీలించిన తర్వాత భారత్.. అన్ని దేశాల కంటే మెరుగ్గా, కరోనాను అడ్డుకుంటోందని తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 17 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. లక్షా మూడు వేలమందికిపైగా మరణించారు.ఇప్పటివరకు కరోనా కారణంగా అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తదితర దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ ట్రాకర్ 13 రకాల ఇండికేటర్లను రూపొందించి, వివిధ దేశాల పనితీరును అంచనా వేసింది. వైరస్‌ను అడ్డుకోవడంలో పాఠశాలలు, వర్క్ స్టేషన్లు మూసివేత, పబ్లిక్ ఈవెంట్స్‌పై కౌన్సిలింగ్, ప్రజారవాణాను మూసివేయడం, వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజా కదలికలపై ఆంక్షలు విధించడం, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, తదితర 13 ఇండికేటర్లతో సూచీని లెక్కగట్టింది. ఇందులో భారత్ మెరుగైన స్థితిని సాధించింది.మరోవైపు భారత్‌లో కరోనా ప్రభావం సాధారణంగానే ఉంది. ఇప్పటివరకు ఏడువేల ఆరు వందలమందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలారు. అలాగే 240 మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి