చైనా బాటలో మధ్యప్రదేశ్
భోపాల్, ఏప్రిల్ 11
కరోనా వైరస్ సోకగానే చైనా అధికారులు తమ ప్రజలను ఇళ్లల్లో పెట్టి తాళాలు వేసి బంధించడాన్ని చాలామంది విచిత్రంగా భావించారు. మరీ అంత ఘోరమా అని జాలిపడ్డారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను కూడా వణికిస్తోంది. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇళ్లల్లోనే ఉండమని ఆదేశించింది. కానీ, ప్రజలు మాత్రం అలా చేయడం లేదు. రోడ్లపై తిరుగుతూ పోలీసులకు పని చెబుతున్నారు. వైరస్‌ను అంటించుకుని వైద్యులకు భారం అవుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా అధికారులు చేసిన ఆ పని తప్పు కాదనే భావన ప్రతి ఒక్కరీ నెలకొంది. మాట వినకుండా బయట తిరిగేవారికి ఆ శిక్షే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు.మధ్యప్రదేశ్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత కూడా మాట వినకుండా ఊర్లకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన 47 మందిని వారి ఇళ్లల్లోనే బంధించారు. మళ్లీ వారు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు వారి ఇళ్లకు తాళాలు వేశారు. ఇండియాలో ఇలాంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన కిందే వస్తాయి. కానీ, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఇంతకంటే మించిన మరో ప్రత్యామ్నయం దొరకలేదు. ఎందుకంటే.. అక్కడి పరిస్థితి అలాంటిదిఇండియాలో ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. మార్చి 25 నుంచి ఇండియాలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చత్తర్‌పూర్ జిల్లా ఖజురహో, రాజనగర్ ప్రాంతాలకు చెందిన కొంతమంది మార్చి 30న బయటకు వెళ్లి ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. వీరిలో చాలామంది గ్వాలియర్, భోపాల్, అలహాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లోని హాస్పిటళ్లలో చికిత్స పొందినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు వారిపై నిఘా పెట్టారు.ఇళ్లల్లో ఉండకుండా తిరుగుతున్నారు, అందుకే..: ఈ ఘటనపై స్థానిక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ స్వామ్నిల్ వాఖెడే మాట్లాడుతూ.. ‘‘మొదట్లో వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని మాత్రమే చెప్పాం. కానీ, ఎవరూ మాట వినడం లేదు. క్వారంటైన్ నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లమీదకు వస్తున్నారు. వారిని ఆపేందుకు వేరే మార్గం లేక.. ఇళ్లకు బయట నుంచి తాళాలు వేశాం. అయితే, వారికి కావల్సిన ఆహారం, నిత్యవసర వస్తువులను మేమే ఇస్తున్నాం. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం’’ అని తెలిపారు. ఆ 47 మందినే కాకుండా వారి బంధువులను కూడా క్వారంటైన్లో ఉంచామని అధికారులు తెలిపారు.