YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అరుణాచలం

అరుణాచలం

అరుణాచలం:
అనగా అనగా....
విద్య పరమార్ధం ఏమిటి?
‘విద్యలేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు.
అసలు విద్యంటే ఏది? దాని పరమార్ధం ఏమిటి?
పశువు స్థాయినుండి మనిషిగా రూపాంతరం చెందించే ఆ ‘విద్య’ ఏమిటి?
ఫ్యాషన్ పేరిట కురచదుస్తులతో శరీరప్రదర్శనలూ, మత్తుపదార్ధసేవనం వల్ల తూలిన ప్రవర్తనలతో మనిషి ఏ ‘స్థాయి’కి పరిణమిస్తున్నాడు?
ఆ స్థాయికి తీసికెళ్ళెదాన్ని ‘విద్య’ అనాలా, ‘అవిద్య’ అనాలా?
ఆదిమానవుడు, ప్రకృతిలోని శీతోష్ణస్థితుల నుండి శరీరాన్ని కాపాడు కునేందుకు కవచంగా దుస్తుల్ని కనుగొని ధరించాడు. క్రమంగా శరీరాన్ని కప్పుకోవడంలో సభ్యతనీ, సంస్కారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టే జంతుస్థాయినుండి వేరుపడ్డాడు. గుహల నుండి గృహ నిర్మాణాల దాకా పయనించాడు. అది పురోగమనం.
మనిషిని జంతుస్థాయి నుండి వేరు చేసింది ‘విద్య’.
అయితే నేడు?
విద్యకు పరమార్ధం ఉద్యోగం.
విద్యకు చివరి గమ్యం ఉపాధి.
చదువుకునేది డబ్బు సంపాదన కోసమే.
ఒకసారి ఉద్యోగమో, ఉపాధో సంపాదిస్తే ఇక అక్కడితో చదువుకోవటానికి, విద్యా సముపార్జనకీ పుల్ స్టాఫ్ పడుతుంది. ఇదేనా చదువంటే? ఇదేనా విద్యంటే?
ప్రతి పిల్లీ, తన కూనలకి ఎలుకలని ఎలా వేటాడాలో నేర్పుతుంది.
ప్రతి కోతీ, తన పిల్లలకి ఇళ్ళ పెరళ్ళల్లోకి చెట్లమీది జామకాయలూ, మామిడికాయలూ ఎలా తెంపుకోవాలో, ఇంటి వాళ్ళు వెంటపడి రాళ్ళు విసిరితే ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది అలాగే మనమూ మన పిల్లలకి [ఉద్యోగమో, ఉపాధి] జీవన భృతి సంపాదించుకునే విద్యని నేర్పుతున్నాం. అంతే!
ఒకప్పుడు కుటుంబవృత్తులుండేవి. ఓ రైతు బాలుడు తన తండ్రి, తాతల దగ్గర వ్యవసాయపు మెళకువలు నేర్చుకునేవాడు. అందుకు ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ అమ్మాయి తన అమ్మ, అమ్మమ్మల దగ్గర హౌస్ కీపింగ్, ఛైల్డ్ కేరింగ్ నేర్చుకునేది. దానికీ ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ వడ్రంగి, ఓ తాపీ మేస్త్రి, ఓ మెకానిక్ ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మేస్త్రిల దగ్గర శిష్యరికం చేసి ఆయా విద్యల నేర్చి పొట్టపోసుకొనేవారు. పొట్టకూటి విద్య పరమావధి అక్కడికే. జీవనోపాధి సంపాదించుకోవటంతో ఆగిపోతే పిల్లికూనకీ, మనకీ తేడా ఏమిటీ? కోతి పిల్లకీ, మన పిల్లలకీ వ్యత్యాసం ఏమిటి?
అసలు విద్య పరమార్ధం పొట్టకూడు సంపాదించటమేనా?
ఎంతమాత్రంకాదు.
వాస్తవానికి – ఏవిద్య అయితే మనిషిని చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా నిరోధిస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఏవిద్య అయితే మనిషిని అహంకారం నుండి దూరం చేస్తుందో, ఆరిషడ్వర్గాల నుండి దూరం చేస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఈ నిజాన్ని మన కళ్ళకి కట్టినట్లు చెప్పే ఓ చిన్నకథ చెబుతాను. అవి ధారా నగరాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్న రోజులు. స్వయంగా కవీ, పండితుడు అయిన భోజరాజు ఆస్థానంలో చాలామంది కవి పండితులుండేవాళ్ళు. మహాకవి కాళిదాసు వంటి గొప్ప వారుండేవారు. అలాంటి భోజరాజు ఆస్థానంలో ఓ సంస్కృతి పండితుడు ఉండేవాడు. ఇతడు బహు కుటుంబీకుడు. అతడి దురదృష్టమేమో గాని రాజుగారి దృష్టి ఇతడి మీద అంతగా పడలేదు. రాజుని మెప్పించే అవకాశాలు అతడి కంతగా రాకపోవటం చేత, రాజ సన్మానం తక్కువుగా ఉండడం చేత అతడికి ఆర్దికంగా చాలా ఇబ్బందులుండేవి. ఈ దారిద్ర్య బాధ పడలేక ఓరోజు అతడు రాజ ప్రాసాదం నుండి ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించాలనుకున్నాడు. ఓరోజు రాత్రి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటుల కనుగప్పి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటులకి రాజుగారే తనని రమ్మన్నారని నమ్మబలికి, రాజు గారి అంతఃపురాన్ని చేరాడు. వెంట ఓపెద్ద సంచీ కూడా తెచ్చుకున్నాడు, దొంగిలించిన సొమ్ము వేసుకుపోవడానికి. మొదట అతడికి ఓ మూల బల్లపై అలంకారార్ధమై పెట్టి ఉంచిన స్వర్ణప్రతిమ కనబడింది. దాన్ని ఎత్తి సంచిలో పెట్టుకోబోయాడు. అంతలో అతడికి తాను చదివిన గ్రంధాల నుండి ‘బంగారు బొమ్మని దొంగిలిస్తే నరకలోకాధిపతి యముడు 7 ఏళ్ళ సుదీర్ఘ కాలం శిక్షవేస్తాడని’ చెప్పే శ్లోకం గుర్తుకువచ్చింది. అంతే! చేతులాడలేదు. బొమ్మని యధాస్థానంలో ఉంచాడు. అంతలో పరిచారకులు రావటంతో మూలన నక్కాడు. మరికొంత సేపు గడిచింది. అంతా సద్దుమణిగాక దారిద్రపీడితడైన ఈ పండితుడు మళ్ళా వెదుకులాట ప్రారంభించాడు. ఈసారి రాజుగారు ధరించే వజ్రాల హారం కనబడింది. నిశ్శబ్ధంగా దాన్ని తీసి సంచిలో వేసుకోబోయాడు. అభరణాలు దొంగిలిస్తే నరకంలో 12 ఏళ్ళు శిక్షపడుతుందన్న శ్లోకం గుర్తుకొచ్చింది. మళ్ళీ ప్రయత్నం విరమించుకున్నాడు. ఉత్తచేతులతో ఇంటికెళ్తే, ఇంట్లో అవసరాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ ప్రయత్నించటం, తప్పుచేస్తే భగవంతుడు దండిస్తాడని చెప్పే శ్లోకం గుర్తుకురావటం, అంతటితో ఆగిపోవటం. రాత్రంతా ఎన్ని వస్తువులపై చెయ్యి వేసాడో, అన్నిటినీ అప్పుడే యధాస్థానంలో పెట్టేస్తూ గడిపేశాడు. వేకువయ్యింది. తొలిఝాము నగారా మ్రోగింది. పండితుడికి కాళ్ళు చేతులూ వణికాయి. భయం ముప్పిరి గొంది. ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. పట్టుబడితే రాజదండన పడుతుంది. చటుక్కున రాజుగారి మంచం క్రిందికి దూరాడు. ఇంతలో రాజు గారి అంతఃపురంలో మంగళ వాద్యాలు మ్రోగాయి. మహారాజు నిద్రలేచి, వళ్ళు విరుచుకుంటూ వెళ్ళి నిలువుటద్దం ముందు నిలుచున్నాడు. అంతలో వందిమాగధుల స్త్రోత్రపాఠాలు మొదలయ్యాయి. ఆ పొగడ్తలు వినగానే, ఆ మహారాజులో తన సంపద, సామ్రాజ్యం, గొప్పదనం పట్లా, తన అందమైన బలిష్ఠమైన రూపం పట్లా అతిశయం, అహంకారం కలిగాయి. రాజు అద్దం ముందు నిలబడిన భంగిమలో, అతడి దేహభాషలో ప్రతిఫలిస్తున్న ఈ అతిశయం, అహంకారం చూడగానే మంచం క్రింద దాక్కున్న పండితుడికి, తాను చదువుకున్న గ్రంధాల నుండి ’ఈ లోకంలో, జీవితం, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్నీ ఎంత అశాశ్వతమైనవో, చావు పుట్టుకలెంత సహజమైనవో, పోయేనాడు ఈ సంపద, సౌభాగ్యమూ, రూపలావణ్యభరితమైన శరీరమూ ఎలా వెంటరాదో ’ తెలియ చెప్పే శ్లోకం గుర్తుకు వచ్చింది. ‘ఈ ప్రపంచానికి మనం వీడ్కొలు చెప్పి వెళ్ళేముందు ఏదీ వెంటరాదనీ, చేసుకున్న మంచి చెడులే తప్ప మరేదీ శాశ్వతం కాదని’ చెప్పే శ్లోకాన్ని బిగ్గరగా, స్పష్టంగా పాడుతూ పండితుడు మంచం క్రింది నుండి బయటికొచ్చాడు. స్వయంగా తాను పండితుడే అయినా భోజ మహారాజు మరుక్షణం ఆ శ్లోకంలోని ఆదర్శప్రాయమైన భావాన్ని గ్రహించగలిగాడు. తనలో పొడసూపిన అతిశయాన్ని, అహంకారాన్ని గుర్తించగలిగాడు. ఎప్పుడైతే గుర్తించగలిగాడో మరుక్షణం అతిశయాన్నీ, అహంకారాన్ని తననుండి పారద్రోల గలిగాడు. ఒకసారి అహంకారం అతడి మనస్సు నుండి దూరమయ్యాక, భోజరాజు ఉదయపు ఆనందాన్ని, సూర్య కిరణాల్లోని నులివెచ్చదనాన్ని, పిల్లగాలి లోని చల్లదనాన్ని, పూల పరిమళాన్ని ఆస్వాదించగలిగాడు. అప్పుడు స్పురించిందాయనకి పండితుడి ఉనికి. అనువుకాని సమయాన, అనువుకాని చోట, అందునా తన శయన మందిరంలో, తన పడక మంచం క్రిందనుండి బయటి కొచ్చిన పండితుణ్ణి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. విచారించగా విషయం బోధపడింది. దారిద్ర బాధ ఎంతగా ఉన్నప్పటికీ దొంగతనానికి ప్రయత్నించినందుకు పశ్చాత్తాపపడుతూ పండితుడు నిజం చెప్పేసాడు.ఈ స్థితికి మహారాజు బాధ్యత వహించాడు. విచారం, పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. పండితుడి ఆర్ధికావసరాలని తాను పట్టించుకోనందుకు మన్నింపు కోరాడు. ఉదయాన్నే సత్యం చెప్పి, తన పాండిత్య ప్రతిభతో సరైన శ్లోకాన్ని గుర్తుచేసి, అహంకారం అనే సర్పంబారిన పడబోయిన తనను కాపాడినందుకు కృతఙ్ఞతలు చెప్పుకొని, పండితుడి దారిద్ర్య బాధని తొలగించాడు.
ఇదీ కథ!
ఈ కథ మనకి విద్య,[ఙ్ఞానంతో కూడిన విద్య] మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుందనీ, చెడు ఆలోచనలూ, చెడు పనులూ చేయబోయినప్పుడు హెచ్చరించి మంచివైపు మళ్ళిస్తుందనీ చెబుతుంది. ఈ కధలో పండితుడికి తప్పు చేయబోయినప్పుడు చట్టం గుర్తుకు రాలేదు. రాజు గుర్తుకు రాలేదు. భగవంతుడు గుర్తుకు వచ్చాడు. దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోగలిగితే సాక్ష్యం లేదు గనుకా, చట్టం ఏంచేయలేదు, రాజూ శిక్షించలేడు. కానీ భగవంతుడికి సాక్ష్యం అక్కర్లేదు. తప్పు చేస్తే విధి తనని శిక్షిస్తుందని పండితుడు భయపడ్డాడు. ఈవిధంగా గుణశీలాలని, నైతికతని నేర్పవలసినది విద్య. విద్య పరమార్ధం ఇదే. అంతేగాని కేవలం డబ్బు సంపాదన విద్య లక్ష్యం కాదు. సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలని ప్రతి మనిషీ, ప్రతి ప్రాణీ కోరుకుంటాయి. నిజానికి సుఖశాంతులతో బ్రతకడం ప్రతివారి హక్కు కూడాను. ప్రతిమనిషి ‘సౌఖ్యంగా బ్రతకటం’ అన్న గమ్యం కోసమే ప్రయత్నిస్తాడు. అయితే గమ్యంతో పాటు, దాన్ని చేరే మార్గం కూడా ఉన్నతంగానే ఉండాలి కదా! బ్రతుకు తెరువు జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. ఈ నేపధ్యంలో ఒకసారి ఆలోచించి చూస్తే - మనిషిని మంచి మార్గంలో నడిపించేది విద్య. చెడు చేయకుండా నిరోధించేది విద్య. ఈ విద్య మనం నేర్చుకున్నామా? నేర్చుకుంటున్నామా? మన పిల్లలకి నేర్పిస్తున్నామా? బ్రతుకు తెరువు సంపాదించిపెట్టేది విద్య అయితే అది `డుకృఞ్ కరణే’ మాత్రమే. అలాంటి ‘డుకృఞ్ కరణే’ మనకే కాదు సర్వ జీవులకీ వచ్చు. జింకల నెలా వేటాడాలో పులిపిల్ల నేరుస్తుంది. లేత చిగురాకుల కోసం ఎక్కడ వెదకాలో జింక పిల్లా నేర్చుకుంటుంది. కానీ మనిషి అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి కదా! 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts