కరోనా కట్టడికి కియోస్క్ లు
శ్రీకాకుళం, ఏప్రిల్ 13
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ బారిన పడకుండా శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో కియోస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించడం ద్వారా కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులతోపాటు, అనుమానితుల నుంచి నమూనాలు సేకరించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరణ కోసం వాక్ ఇన్ కియోస్క్ (విస్క్)లను ఏర్పాటు చేయగా, చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు మమతారాణి కూడా దాదాపు ఇలాంటిదాన్నే సొంతంగా తయారు చేశారు. శ్రీకాకుళంలో రిమ్స్, జెమ్స్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ రూమ్ నాలుగడుగుల వెడల్పు, పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తులో అద్దాలతో ఉంటుంది. రూమ్ కౌంటర్ వద్ద రెండు రబ్బరు గ్లౌజులు ఉంటాయి. పలమనేరు ప్రభుత్వాస్పత్రిలోనూ ఫ్లైవుడ్‌తో, అద్దాలతో డాక్టర్ మమతారాణి ఇలాంటి కియోస్క్‌నే రూపొందించారు. రోగి బయట.. వైద్యుడు కియోస్క్ లోపల ఉంటారు. వైద్యుడు ఆ రబ్బరు గ్లౌజులు ధరించి అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తారు. తర్వాత నమూనాలను మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపుతారు. సాధారణంగా అయితే గొంతులో నుంచి నమూనాలు సేకరించే సమయంలో రోగికి వాంతులు కావడంతోపాటు తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులకు సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ కియోస్క్‌ల ద్వారా అలాంటి ప్రమాదం తప్పుతుంది. వైద్యులకు, అనుమానిత రోగులకు మధ్య పెద్ద గ్లాసు అడ్డుగా ఉంటుంది కాబట్టి వైరస్ వైద్యులకు అంటుకునే అవకాశం ఉండదు. నమూనా సేకరణ పూర్తయ్యాక ఆ రూమ్‌ను శానిటైజ్ చేసి, సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేస్తారు. ఇలాంటి కియోస్క్‌లు ప్రస్తుతం కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులోని తిరువూరుల్లో మాత్రమే ఉండగా మన రాష్ట్రంలో మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు