బ్లడ్ బ్యాంకులలో రక్తం కొరత
హైద్రాబాద్, ఏప్రిల్ 13
త్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపు ఇచ్చారు. తలసేమియా, క్యాన్సర్, బ్లడ్ కేన్సర్ రోగులు, హిమోఫీలియా తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం హైదరాబాద్‌లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యానగర్ అడిక్ మెట్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వద్ద సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ పాల్గొని రక్తదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 దృష్ట్యా విధించిన లాక్‌డౌన్ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయని.. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రక్త నిల్వలు సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇదే అంశమై ఇప్పటికే అన్ని ఐటీ కంపెనీలకు, ఉద్యోగుల వాట్సప్ గ్రూపులకు సమాచారం చేరవేశామని తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ గ్రూపుల్లో విషయాన్ని షేర్ చేశామన్నారు. ఎక్కువ మొత్తంలో రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా బాధితులకు అండగా నిలబడాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సజ్జనార్ రక్తదానంపై కేటీఆర్ ట్విటర్ ద్వారా అభినందించారు.‘వివిధ ఆస్పత్రుల్లో రక్తం అవసరమైన బాధితులు.. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే అరుదు బ్లడ్ గ్రూప్‌లు అయిన ఏబీ-నెగెటివ్, ఓ-నెగెటివ్, బీ-నెగెటివ్, ఏ-నెగెటివ్ గ్రూప్ రక్తానికి తీవ్ర కొరత ఉంది.’’ అని అన్నారు. రక్తం ఇవ్వడానికి ఆసక్తి చూపిన దాతల ఇంటికే వాహనం పంపిస్తామని నిర్వహకులు తెలిపారు. వారిని ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి తిరిగి అదే వాహనంలో జాగ్రత్తగా ఇంటివద్ద దిగబెడతామని నిర్వహకులు తెలిపారు. దాతలు సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్లు 9490617440, 9490617431లో సంప్రదించాలని సూచించారు.అనంతరం సజ్జనార్ బాలానగర్ జోన్ లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ అమలుతీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. మార్కెట్ కమిటీ, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. షాపునకు షాపునకు మధ్య సామాజిక దూరం ఉండేలా చూడాలని వారికి సీపీ సూచన చేశారు.