YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మళ్లీ ఒక్కటైన విపక్షాలు

 మళ్లీ ఒక్కటైన విపక్షాలు

 మళ్లీ ఒక్కటైన విపక్షాలు
విజయవాడ, ఏప్రిల్ 13
గమ్యం చేరుకోవడానికి అనుసరించే మార్గమూ ముఖ్యమే అంటారు మహాత్మాగాంధీ. రాజకీయ నాయకులు ప్రతి సందర్భంలోనూ మహాత్ముని పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్ కు ఆయన ఒక గైడింగ్ ఫోర్స్ కింద లెక్క. మంచి చేయాలనుకున్నా సరే అనుసరించే పద్ధతిని బేరీజు వేసుకున్న తర్వాతనే నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరించిన విధానం ఎన్నడూ లేని విధంగా చర్చనీయమవుతోంది. పాలనపరమైన, అధికార నిర్ణయాల విషయంలో ప్రభుత్వం ఎటువంటి వైఖరిని తీసుకున్నా ఆక్షేపించదగినది పెద్దగా ఉండదు. ప్రతిపక్ష రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే సంబంధితులకు ప్రయోజనం సమకూర్చడమనేది ఆనవాయితీగా వస్తున్న తంతే. పదవీ పందేరంలో అస్మదీయులకు పెద్దపీట వేయడం అన్ని పార్టీల హయాంలోనూ చూస్తున్నదే. గతంలో తెలుగుదేశం చేసింది కూడా అదే. అయితే రాజ్యాంగ బద్ధ పదవుల విషయంలో కొంత సంయమనం పాటించాలి. లేకపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో తీసుకున్న చర్య న్యాయ సమీక్షకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.గడచిన 20 రోజులుగా జనజీవనం స్తంభించిపోయింది. నిత్యావసరాల పంపిణీ, సరఫరా పెద్ద సమస్యగా పరిణమించింది. ఎప్పటిలోగా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేస్తారో తెలియని అయోమయం. తమ జీవన స్థితిగతులు ఎప్పటికి కుదుటపడతాయో తెలియని గందరగోళం. ఈ స్థితిలో ప్రభుత్వాలు తమ సర్వశక్తులను కేంద్రీకరించి ప్రజారోగ్యంపైనే పెట్టాలి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చూడాలి. వేరే విషయాలపై ద్రుష్టి పోకుండా వేల సంఖ్యలో కోవిడ్ టెస్టులు నిర్వహించి ప్రజలకు భరోసానివ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల వంటివి ప్రస్తుతానికి అప్రస్తుతం. ఎందుకంటే గ్రామ, పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కొంతకాలం పరస్పర సహకారంతో పనులు చేసుకోవాలి. రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం ప్రజల్లో అంతర్భాగంగా సేవలు అందించాలి. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో ఉన్న విభేదాలకు ఇప్పుడు ఏమంత ప్రాధాన్యం లేదు. కరోనా పోరులో ఎన్నికల కమిషనర్ కు పాత్ర లేదు. మరో అయిదారు నెలల వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదు. ఇప్పటికే కుదేలై ఉన్న గ్రామసీమలు, పట్టణాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఇదంత సులభం కాదు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన సమయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేని వివాదాన్ని రగిల్చి విమర్శలు మూటగట్టుకోవడంపై ప్రజలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ రాజ్ చట్టానికి తాము సంస్కరణలు మాత్రమే చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదా సమయమన్న ప్రశ్నకు సహేతుకమైన సమాధానం దొరకడం లేదు.వాస్తవాల కంటే ప్రజల్లో నెలకొనే భావోద్వేగాలే రాజకీయాల దశ దిశ నిర్దేశిస్తుంటాయి. అందుకే పార్టీలు ప్రజల్లో సెంటిమెంటును రగలుస్తుంటాయి. ఏదో జరిగిపోతోందనే భావనను రేకెత్తిస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీలను ప్రజల దృష్టిలో చులకన చేస్తుంటాయి. తద్వారా రాజకీయాధికారానికి బాటలు వేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని రెండు రాజకీయ పార్టీలు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాయి. గతంలో టీడీపీ పాలనను అన్నిరకాలుగా ప్రశ్నిస్తూ, లోపాలను భూతద్దంలో చూపుతూ ప్రజల్లోకి వెళ్లింది వైసీపీ. కొంతమేరకు ఫలితాలను సాధించింది. ప్రస్తుతం టీడీపీ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రజాప్రయోజనాల కంటే రాజకీయ వైషమ్యాలే ఎక్కువయ్యాయన్న ప్రచారాన్ని టీడీపీ చేపట్టింది. ఈ ప్రచారం క్రమేపీ పుంజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం ప్రతిపక్షానికి అయాచితవరంగా మారుతోంది. సీరియస్ గా వ్యవహరించాల్సిన విషయాలకు , సున్నితంగా పక్కనపెట్టాల్సిన అంశాలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వ అగ్రనాయకత్వం గుర్తించలేకపోతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అన్ని విషయాల్లోనూ ఫైనల్ కాదు. రాజ్యాంగ పరిధిలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. కానీ మొత్తమ్మీద రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపైన ఉంటుంది. మిగిలిన వ్యవస్థలు తమ పరిధికి మాత్రమే పరిమితమవుతాయి. అందుకే వివిధ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ అంతిమ లక్ష్యం సాధించడం సర్కారు కర్తవ్యం.వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దాదాపు అన్ని విపక్షాలు వివిధ సందర్భాల్లో ఏకమవుతూ వస్తున్నాయి. అన్ని గొంతులు ఒకటే కావడంతో స్వరం పెద్దగా వినిపిస్తోంది. ప్రతిపక్షాలను అధికారపార్టీ దీటుగా ఎదుర్కోలేకపోతోంది. మూడు రాజధానులు, యూనివర్శిటీ పాలక మండళ్ల నియామకాల వంటి వాటిపై పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కానీ అధికార పక్షం దీటుగానే తిప్పికొట్టగలిగింది. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు, అర్హతల మార్పు విషయంలో రాజ్యాంగ సంశయాలు ముడిపడి ఉండటంతో విపక్షాలు వాయిస్ పెంచాయి. న్యాయపరంగా సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలితే నైతికంగా ఇబ్బందికరమే. అందులోనూ భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది.
 

Related Posts