అమెరికాలో గంటకు 83 మంది మృతులు
న్యూయార్క్, ఏప్రిల్ 13
కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా ఎన్నడూ లేనంతగా అతలాకుతలం అవుతోంది. మొన్నటివరకు కేసుల సంఖ్యలో మాత్రమే మొదటి స్థానంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు మరణాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. రోజురోజుకీ పరిస్థితి చేయి దాటుతుండటంతో అధినేత నుంచి కిందిస్థాయి అధికారులకు వరకు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విరాజిల్లుతున్న అమెరికాలో కరోనా మరణాల్లో ముందు వరుసలో నిలవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.కరోనా సోకిన అమెరికా పౌరుల్లో గంటకు 83 మంది ప్రాణాలు కోల్పోతున్నారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఆదివారం రాత్రి నాటికి దేశవ్యాప్తంగా 21,474 మంది కరోనా వైరస్‌తో చనిపోయినట్లు పేర్కొంది. ఫిబ్రవరి చివరి వారంలో అమెరికాలో తొలి కరోనా మరణం సంభవించింది. అప్పటి నుంచి మొదలైన మృత్యుఘోష.. దేశం మొత్తం పాకింది. ముఖ్యంగా ప్రపంచానికే ఆర్థిక రాజధానిగా న్యూయార్క్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఎక్కువ కేసులు, మరణాలు ఇక్కడే నమోదు కావడం కలవర పరుస్తోంది. అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 5.45లక్షలకు చేరుకుంది.దేశంలో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు 50 రాష్ట్రాల్లో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. కరోనాను పెనువిపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం.. ప్రజలు భౌతిక దూరం పాటించడం సహా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. దేశంలోనే తొలిసారిగా 50 వేల మంది సైన్యాన్ని కరోనా కట్టడి విధులకు వినియోగిస్తూ ఉత్తర్వులిచ్చారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, క్రమంగా పరిస్థితి చక్కబడుతోందని వైట్‌హౌస్ ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. అమెరికాలో మరణాల సంఖ్య 60 వేలకు పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కరోనా వైరస్‌కు కేంద్ర స్థానంగా ఉన్న న్యూయార్క్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, అక్కడ కొత్త కేసులు నమోదు కావడం లేదని వైట్‌హౌస్ వర్గాలు తెలిపారు. ఆంక్షల ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మే తొలి వారంలో అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.