భారతీయులను స్వదేశానికి పంపేందుకు సిద్ధం
దుబాయ్, ఏప్రిల్ 13
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటిస్తున్న ట్రావెలర్స్..ఎక్కడికక్కడే చిక్కుబడిపోయారు. ఇప్పటికే తమను ఆదుకోవాలంటూ భారత ప్రభుత్వానికి కూడా వివిధ దేశాల్లో చిక్కుకున్న ఇండియన్స్ నుంచి విజ్ఞాపనలు అందాయి. మరోవైపు తమ దేశంలో చిక్కుకుపోయిన వారి గురించి తాజాగా యూఏఈ ఒక ప్రకటన చేసింది. కరోనా వైరస్ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినవారిని వారి స్వదేశానికి పంపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.భారత్‌లో యూఏఈ రాయబారి అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్ బన్నా దీని గురించి తాజాగా స్పష్టతనిచ్చారు. స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న విదేశీయులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని పంపుతామని, అలాగే ఆయా దేశాల నుంచి దీనికి సంబంధించిన రిక్వెస్ట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు లక్షలమందికిపైగా కరోనా టెస్టులు చేశామని చెప్పారు.మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని ఇటీవలే కేరళ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గల్ఫ్‌కు వలస వెళ్లిన వారు కేరళలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడి నుంచి స్వదేశానికి చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కేరళకు చెందిన ముస్లిం కల్చర్ సెంటర్ హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై అఫిడవిట్ జారీ చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.