వ్యాక్సిన్ తోనే నియంత్రణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి రాలేదు. దీనికోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధిచేసి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఏడాది సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అధికారి ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నాబర్రో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి ముప్పు నుంచి మానవాళి ఇప్పట్లో బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ప్రమాదం పొంచివుందని అభిప్రాయపడ్డారు.వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేంతవరకూ మహమ్మారి మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. కొద్దికాలం పాటు తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమయంలో వైరస్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, లక్షణాలున్న వారిని వెంటనే ఐసోలేషన్ కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. దీనికి ప్రపంచ దేశాలు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మహమ్మారి మెల్లగా ప్రారంభమై క్రమంగా విజృంభిస్తుందని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇది ఫ్లూ మాదిరి కాదని.. ఉప్పెనా విరుచుకుపడుతుందని అన్నారు. వైరస్‌ను గుర్తించి, ఐసోలేషన్‌కు తరలించాలని.. ప్రతి దేశం తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ప్రభావం కొద్ది రోజుల్లోనే తగ్గుతుందని పలు దేశాలు భావిస్తున్న తరుణంలో డేవిడ్ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డబ్ల్యూహెచ్ఓకు తాము నిధులు నిలిపివేస్తామని ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అధికార ప్రతినిధి స్పందించారు. అమెరికాతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. ఒకవేళ అదే జరిగితే చాలా దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.ఇంటికే పరిమితం కావాలని విధించిన ఆంక్షలు సడలిస్తామని చేస్తున్న ప్రకటనలపై ఆయా దేశాలు పునరాలోచించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గతవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిషేధాజ్ఞలను సడలిస్తే మరిన్ని కేసులు పెరుగుతాయని అమెరికా జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ చీఫ్ అంథోనీ ఫ్యూసీ వ్యాఖ్యానించారు.