*అపరాధ క్షమాపణ*
తప్పులు చేయడం మానవ స్వభావం. పుట్టుక మొదలు గిట్టేదాకా తెలిసో, తెలియకో తప్పులు చేస్తుండటం అతడికి సహజం. వాటిని ‘అపరాధాలు’ అంటారు. జగద్గురువు శంకర భగవత్పాదులు మానవ అపరాధాల్ని స్తోత్ర రూపంలో శివుడికి నివేదించారు. క్షమించాలని వేడుకొన్నారు. అది ‘శివాపరాధ క్షమాపణ స్తోత్రం’గా ప్రసిద్ధి చెందింది.
‘ఓ పరమేశ్వరా! రోగాల వల్ల ఎంతో దుఃఖం కలుగుతోంది. అలాంటి దుఃఖకారకమైన అపరాధం చేయకుండా నన్ను రక్షించు. యౌవనంలో అనేక ‘మాధుర్యాలు’ నన్ను వెంటాడుతున్నాయి. అటువంటి దుర్దశ మళ్లీ కలగకుండా అనుగ్రహించు. వృద్ధాప్యంలో శక్తి నశిస్తోంది. అధైర్యం తరుముతోంది. మృత్యుభయం పీడిస్తోంది. ముళ్లకంపలో పడిన కాకిలా మారింది నా పరిస్థితి. పరమ దుర్భరంగా ఉంది. అపరాధాల్ని మన్నించి, నన్ను కాపాడు. నేను పొద్దున నిద్ర లేచి స్నానం చేసి నీ కోసం గంగాజలాలతో అభిషేకం చేయలేదు. ఒక్కనాడైనా, ఒక్క మారేడు దళాన్నీ సమర్పించలేదు. సరస్సులో పూచిన కమలాన్ని తెచ్చి నీకు అలంకరించలేదు. నా అపరాధాల్ని మన్నించు. పంచామృతాలతో నీకు అర్చన చేయలేదు. పదహారు ఉపచారాలూ చేయడం మరిచాను. ఒక్క పత్రమో, పుష్పమో, ఫలమో- ఏదీ సమర్పించలేదు. శాస్త్రాలు ఎన్నో మంచి విషయాలు చెప్పినా, వాటిని నేను వినలేదు. వాటి గురించి ఆలోచనైనా చేయలేదు. ఏ ఒక్కటీ మనసులో పెట్టుకోలేదు. ఇదంతా నా అపరాధమే కాబట్టి మన్నించి అనుగ్రహించు. స్వామీ! నీ కోసం ఒక్కనాడైనా నమక చమకాలతో కూడిన రుద్ర మంత్రాల్ని పఠించలేదు. యజ్ఞాలు చేయలేదు. నీ నామాన్ని జపించలేదు. నీ కోసం తపించలేదు. ఈ అపరాధాల్ని క్షమించు. నాకు అపారంగా ధనం ఉంది. తిరిగేందుకు వాహనాలున్నాయి. పెద్దపెద్ద నివాస భవనాలున్నాయి. ఆస్తిపాస్తులున్నాయి. కుటుంబం ఉంది. బంధుమిత్రులెందరో ఉన్నారు. సమాజంలో గౌరవ మర్యాదలున్నాయి. పలుకుబడి ఉంది. అధికారం ఉంది. ఇన్ని ఉన్నా ఏం లాభం? ఇవన్నీ ఏ క్షణంలోనైనా దూరం కావచ్చు. ఇవన్నీ క్షణభంగురాలే. వీటి వల్ల నాకు మనశ్శాంతి లభించడం లేదు. పరమేశ్వరా! ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ, మానసిక శాంతితో ఉండే వరాన్ని ప్రసాదించు! చూస్తుండగానే ముసలితనం వచ్చేసింది. కాలం ఎంతో వేగంగా పరుగెత్తుతోంది. మొన్న మెరిసిన యౌవనం నేడు మాయమైపోయింది. గతించిన రోజులు తిరిగి రావడం లేదు. కాలం నన్ను కబళించేలా ఉంది. సంపదలన్నీ నీళ్లలో తరంగాల్లా అప్పుడే ఎగసిపడి, అప్పుడే మాయమైపోతున్నాయి. జీవితమంతా మెరుపులా మెరిసి మాయమైందని అనిపిస్తోంది. ఈ దురవస్థ నుంచి నన్ను రక్షించి, మనశ్శాంతిని ప్రసాదించు స్వామీ!’ ఇలా సాగిపోయే శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో మానవ జీవన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. మనిషి జననం నుంచి మరణం వరకు ఉత్థాన పతనాలుగా సాగే దశలెన్నో ఈ స్తోత్రంలో దర్శనమిస్తాయి. ‘మనిషి సుఖాలుగా భావిస్తున్నవన్నీ పరిణామ దశలో దుఃఖదాయకాలు’ అనే సత్యం బోధపడుతుంది.
యౌవనం పైకి ఎంత అందంగా కనిపించినా, అది కొంతకాలమే ఉంటుంది. అది అనిత్యమే!
పలుకుబడులు, పదవులు కొన్నాళ్ల మురిపాలే అని; వాటికీ శాశ్వతత్వం లేదని ఈ స్తోత్రంతో తేటతెల్లమవుతుంది. పరమేశ్వరుడిపై మనసు నిలపడం అనే పారమార్థిక భావన ఒక్కటే ఆత్మతృప్తికి, మానసిక శాంతికి మూలమవుతుందని ఈ స్తోత్రం బోధిస్తుంది. స్తోత్రాల్లో భక్తితో పాటు మానవ జీవన సౌందర్యమూ దాగి ఉంటుంది. వారిని నీతిమార్గంలో నడిపేందుకు, సంస్కరించి ముందుకు సాగేలా చేసేందుకు స్తోత్రాలు బాటలు వేస్తున్నాయి. అవి ధర్మపథాన్ని చూపుతున్నాయి. అశాశ్వత అంశాలపై మనుషుల దురాశను దూరం చేస్తున్నాయి. శాశ్వతానందాన్ని సమకూరుస్తున్నాయి. ఇదంతా సమాజానికి ఉపకరించే సాహిత్యమే!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో