టమాటా దిగుబడి సరే...ధర ఏదీ
నల్గొండ, ఏప్రిల్ 14
దిగుబడి బాగానే ఉన్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాదాద్రి జిల్లాలో 3 వేల హెక్టార్లలో కూరగాయలు పండిస్తుండగా ఇందులో టమాట సాగే ఎక్కువగా ఉంది. ఓ వైపు పెట్టుబడులు, పురుగు మందుల ధరలు పెరుగుతోంటే.. మరో వైపు హోల్ సేల్ మార్కెట్ లో మాత్రం ధరలు అమాంతం తగ్గుతున్నాయి. దీంతో లాభం సంగతేమో గానీ రవాణా ఖర్చులు కూడా మీద పడే పరిస్థితి ఉండడంతో రైతులు టమాటను తెంపకుండా తోటలోనే వదిలేస్తున్నారు.ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్కెట్ కు టమాట వస్తుండడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరను తగ్గించేశారు. రైతుబజార్కు వచ్చే రైతుల విషయంలో వ్యాపారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిన ధరకే ఇవ్వాలని, లేకుంటే ఎక్కడా అమ్మనిచ్చేది లేదన్నట్లు బెదిరిస్తున్నారు. మార్కెట్ కు వచ్చిన రైతు పంటను అమ్ముకోకుండా తిరిగి వెళ్లడు కాబట్టి దీనిని అదనుగా తీసుకున్న వ్యాపారులు 25 కిలోల టమాట ఉండే బాక్స్ను కేవలం రూ. 80 కే కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన కిలో టమాట రూ. 3.50 కంటే తక్కువే పడుతోంది. వ్యాపారులు మాత్రం కిలో టమాటను రూ. 10కు అమ్ముకుంటున్నారు.లాక్ డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు సైతం ధరలను అమాంతం పెంచేశారు. గతంలో రూ. 400 నుంచి రూ. 500 తీసుకోగా ఇప్పుడు రూ. 700 డిమాండ్చేస్తున్నారు. ఒక రైతు ఆటోలో 20 బాక్సుల టమాట తీసుకెళ్తే.. రూ. 1600 కంటే తక్కువే వస్తున్నాయి. ఇందులో రవాణాకు రూ. 700, ఇద్దరు కూలీలకు రూ. 500 చెల్లించగా రైతుకు మిగిలేది స్వల్పమే. ఒకవేళ మార్కెట్ కు ఎక్కువ మంది రైతులు వస్తే వ్యాపారులు ధరను మరింత తగ్గించేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చుల భారం కూడా తమపైనే పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేటుకు అమ్ముకోవడం కంటే తెంపకుండా వదిలేయడమే మంచిదని రైతులు అంటున్నారు