చివరి దశలో వ్యాక్సిన్ తయారు
లండన్, ఏప్రిల్ 14
మానవాళికి ముప్పుగా మారిన కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై బ్రిటన్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ పరిశోధనలను లీడ్ చేస్తున్న ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త తీపికబురు తెలిపారు. వచ్చే సెప్టెంబర్ వరకల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.బ్రిటన్‌లో వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల బృందానికి సారా నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అభివృద్ధి పరిచే దశలో తాము పురోగతి సాధిస్తున్నామని త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని సారా పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మానవులపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న చోట దీన్ని పరీక్షించి ఫలితాలను బేరీజు వేస్తున్నారు. మరోవైపు మిగతా వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని సారా అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 79 వేలకు చేరింది. 9800మందికిపైగా ఈ మహమ్మారికి బలయ్యారు.