ప్రధానికి సూచనలు, సలహాలు ఇచ్చాను
- చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ ఏప్రిల్ 14
కరనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసి కొన్ని సూచనలు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడాలని అడిగానని, దీంతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. కరోనాకు సంబంధించి ప్రధాని మోదీకి పలు సూచనలు ఇవ్వగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి పని చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారని, ఇందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్డౌన్తో కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఇదో పెను సవాల్గా మారిందన్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. కొన్నిచోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయితే కరోనాపై అందరూ వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని లాక్డౌన్ నిబంధనలు పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాతో అగ్రదేశాలూ అతలాకుతలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను కొన్ని రాష్ట్రాలు కట్టడి చేయగలుగుతున్నాయని, మరికొన్ని సమర్థంగా చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు.