వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం
ప్రజలు సహకరించాలి
మంత్రి కే తారకరామారావు
రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 16
కరోనా నియంత్రణకు రాబోయే రెండు వారాలు చాలా కీలకమని మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ నియమాలను ప్రజలందరూ తప్పక పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా లో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి తారక రామారావు సిరిసిల్ల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గం అని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. స్వీయ నియంత్రణతో వ్యాధి సోకకుండా చూసుకోవడమే అసలైన మందు అని ,ఆ దిశగా ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో మిగతా జిల్లాల తో పోల్చుకుంటే కరోనా ను కట్టడి చేసే విషయంలో రాజన్న సిరిసిల్ల మెరుగైన స్థితిలో ఉందన్నారు. అధికారుల కృషి తో పాటు జిల్లా ప్రజల సంపూర్ణ సహకారం వల్లే ఇది సాధ్యమైంది అన్నారు . ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసే వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు అని మంత్రి కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే మాస్కులు ధరించి రావాలన్నారు . భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన విధంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకారం అందించాలి అని పేర్కొన్నారు. ప్రజలు ఇదే విధమైన సహకారం అందిస్తే జిల్లాలో కరోనా కేసు ఒకటి కే పరిమితం అవుతుంది అన్నారు.
కరోనా నియంత్రణ చర్యలను పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే ప్రజలు నిక్కచ్చిగా పాటిస్తున్నారని మంత్రి తెలిపారు. పల్లె ప్రజలను ఆదర్శంగా తీసుకొని పట్టణ ప్రజలు కూడా కరోనా నియంత్రణకు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ అమలు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకొని జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సహకారం అందించాలని కోరారు.
కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. ప్రజల అందరి సహకారంతో రాష్ట్రం కరోనా ఫ్రీ గా త్వరలో అవిర్భవిస్తు o దని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న దృష్ట్యా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలో ఉన్న వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చూసుకుంటుందన్నారు.