24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ ఏప్రిల్ 15
దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 377 మంది చనిపోయారు. కరోనా నుంచి 1,306 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 11,439 మందికి కరోనా వైరస్ సంక్రమించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.'నాన్ హాట్‌స్పాట్స్ ఏరియాల్లో ఈనెల 20 నుంచి దశలవారీగా ఆంక్షలను క్రమంగా సడలిస్తాం. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్స్ కోసం గైడ్‌లైన్స్ విడుదల చేశాం. దేశంలోని జిల్లాలను హాట్‌స్పాట్స్, నాన్‌హాట్‌స్పాట్స్, గ్రీన్ జోన్లుగా విభజించాం. దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్స్ జిల్లాలను గుర్తించాం. కంటైన్మెంట్ ప్రాంతాలపై ఇప్పటకే రాష్ట్రాలకు స్పష్టతనిచ్చాం. హాట్‌స్పాట్స్ ఏరియాలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని' కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.