YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆటవీ కార్యకలాపాలపై కేంద్రం సూచనలు

ఆటవీ కార్యకలాపాలపై కేంద్రం సూచనలు

ఆటవీ కార్యకలాపాలపై కేంద్రం సూచనలు
హైదరాబాద్ ఏప్రిల్ 16
కోవిద్ - 19 (కరోనా వైరస్) నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తూనే, అటవీ పరిరక్షణ చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులతో (పీసీసీఎఫ్) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిద్ వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, అటవీ శాఖ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా సూచించారు. అటవీ పరిరక్షణ, అవాసాల అభివృద్ది,  వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్యప్రాణులకు నీటి సదుపాయాల కల్పన, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, కంపా నిధులతో చేపట్టిన పనుల పురోగతి, నిధుల విడుదల తాజా పరిస్థితి, ప్రాజెక్ట్ టైగర్, ఎలిఫెంట్, గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా నర్సరీల అభివృద్ది, అటవీ ప్రాంతాల మళ్లింపు సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అటవీ అగ్ని ప్రమాదాల నివారణలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, మానవ వనరులకు తోడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వాడాలని డీజీ సంజయ్ కుమార్ సూచించారు. కేంద్ర అటవీ శాఖ సూచనల మేరకు ఇప్పటికే తగిన జాగ్రత్తలు చేపట్టామని, కంపా పధకం నిధులతో పాటు ఇతర పనులు, అనుమతులకు సంబంధించిన నివేదికలను గడువులోగా పంపుతున్నామని సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. అలాగే కోవిద్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో అటవీ శాఖ భాగం అవుతోందని తెలిపారు.  అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, జిల్లా కంట్రోల్ రూమ్ లలో అటవీ శాఖ సిబ్బంది సేవలు అందిస్తున్నారని, అలాగే అడవుల్లో ఉన్నగిరిజనులకు, అటవీ సమీప ప్రాంతాల పేదలకు నిత్యావసరాలు అటవీ శాఖ తరపున అందిస్తున్నా మన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల పీసీసీఎఫ్ లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పీసీసీఎఫ్ ఆర్. శోభతో పాటు, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ.పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, ప్రత్యేక అధికారులు శంకరన్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు..

Related Posts