మే నెలలో టెన్త్ ఎగ్జామ్స్
హైద్రాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాకాసి విద్యా సంవత్సరంపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే..పరీక్షలపై..తదితర వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాయిదా పడిన ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వాయిదా వేసింది.మరలా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఏప్రిల్ 30వ తేదీకల్లా అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మే నెల మూడో వారంలో ఈ సెట్ ను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. ఎంసెట్ ను మూడో వారంలో ప్రారంభించి జూన్ 01వ తేదీకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రోజుల్లోనే ఈసెట్ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు.ఈ లోగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఐసెట్, ఎడ్ సెట్, పీఈసెట్, పీజీఈసెట్, లాసెట్ పరీక్షలను జూన్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. మే నెలాఖరుకు పాలిసెట్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రధానంగా పదో తరగతి పరీక్షలను మే ఫస్ట్ వీక్ లో నిర్వహించేందుకు కసరత్తులు జరుపుతున్నారు. ఈ ఫలితాలను జూన్ లో వెల్లడించే అవకాశాలున్నాయి.