ఆర్టీసీ బస్సుల్లో పచారి
ఖమ్మం. ఏప్రిల్ 16,
ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండాలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ జోన్ గా ప్రకటించింది. కరోనా బాధితుడిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పెద్దతండాలో పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన అన్నారు. వైరస్ మరింత ప్రబల కుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు, అలాగే ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలకు ఇదేవిధంగా ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో తండావాసులు తమకు నిత్యావసర సరుకులకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రికి తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి తమకు కావలసిన సరుకులు వారి వద్దకే వస్తాయని తెలిపారు. అనంతరం వారికి కావలసని సౌకర్యాలు కల్పించమని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సునే కిరాణా దుకాణంగా మార్చి తండావాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు.