కొణిదెల బ్రదర్స్ దారెటు...
హైద్రాబాద్, ఏప్రిల్ 16
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని ఎవరినైనా అడిగితే.. వెంటనే చెప్పే సమాధానం.. పదవులు, అధికారం కోసమని చెబుతారు. అయితే, అందరూ అలానే ఉంటారా ? అంటే.. ఉండరని, తాము ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజకీయాలను సహించబోమని, తాము కేవలం పదవుల కోసమో.. అధికారం కోసమో.. రాజకీయాలు చేయడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు వెల్లడించారు. తమకు అధికారం ఉన్నా లేకున్నా కూడా తాము ప్రజల కోసం నిలబడతామని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటామని, ప్రశ్నించేందుకు మాత్రమే తాము రాజకీయాల్లోకి వస్తున్నామని ఇలా అనేక రూపాల్లో అనేక విషయాలు చెప్పు కొచ్చారు మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కూడా.అంతేకాదు, తమకు పాతికేళ్ల భవిష్యత్ ఉందని, పాతికేళ్ల రాజకీయాలు చేయడం కోసమే తాము రాజకీయ పార్టీ పెట్టామని కూడా చెప్పారు. పరమ రోటీన్ రాజకీయాలు, రాజకీయ నాయకులతో విసిగిపోయిన ప్రజలు అందరూ దీంతో అందరూ.. హమ్మయ్య.. ఇప్పటికైనా ఓ నిఖార్సయిన నాయకుడు దొరికాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. వీరు కూడా సాధారణ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగానే రాజకీయాలు చేస్తుండడం గమనార్హం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలోని నరసాపురం ఎంపీ స్థానం నుంచి నాగబాబు, భీమవరం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేశారు. ఈ క్రమంలో పవన్ రెండో స్థానంలోను, నాగబాబు 2.5 లక్షల ఓట్లు సాధించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. వీరికి మంచి ఓట్లే పడ్డాయిఅంటే.. టెక్నికల్‌గా ఇద్దరూ కూడా ఓడిపోయినా.. ప్రజల దృష్టిలో మాత్రం మంచి ఓట్లు పడ్డ నాయకులుగానే గుర్తింపు పొందారు. కానీ, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరూ కూడా నియోజకవర్గాన్ని మరిచిపోయారు. నరసాపురంలో ఒకే ఒక్కసారి నాగబాబు.. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక, పవన్ అది కూడా చేయలేదు. కేవలం వీడియో కాన్ఫరెన్సులకే పరిమితమయ్యారు. అంతేకాదు, నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇద్దరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో కేడర్ కూడా నిస్తేజానికి గురై.. తమ దారి తాము చూసుకున్నారు.మరోపక్క పవన్ కల్యాణ్ సినిమాల్లో బీజీ అయిపోయాడు. నాగబాబు రియాల్టీ షోలతో బిజీ అయిపోయారు. మరి వీరు చెప్పిన సిద్ధాంతాలు ఏమయ్యాయి. నిఖార్సయిన నేతలుగా గుర్తింపు తెచ్చుకుంటామని చెప్పిన మాటలు ఏమయ్యాయి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మిగిలిన నాయకుల మాదిరిగానే వీరు కూడా అధికారం కోసం, పదవుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏపీలో జనసేనను మిగిలిన నియోజకవర్గాల్లో పక్కన పెట్టినా కనీసం ఈ అన్నదమ్ములు ఇద్దరూ పోటీ చేసిన ఈ రెండు నియోజకవర్గాల్లోనూ నాయకులను నడిపించే వారు కూడా కరువయ్యారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా మారతారా? చూడాలి.