విజయనగరం లో వేసవి కష్టాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. ఇప్పటికే నదుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. .బావులు ఎండి పోయాయి. తాగునీటి బోర్లు దాహార్తిని తీర్చలేకున్నాయి. దీంతో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడివాల్సి రావడంతో అష్టకష్టాలు పడుతున్నారు విజయనగరం జిల్లా వాసులు. ఇక విజయనగరం పట్టణంలో 40 వార్డులున్నాయి. సుమారు మూడు లక్షల జనాభా ఉన్నారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు 30 ఎం ఎల్ డి నీరు అవసరమైతే అందుబాటులో ఉన్నది మాత్రం 17 ఎం ఎల్ డి మాత్రమే. దీంతో ఎప్పటి లాగే వారానికి రెండు రోజులు మాత్రమే తాగునీరందుతోంది. మూడు రోజుల కోసారి అందించే నీటితో వారమంతా గడపాలి. వేసవి కావడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. విజయనగరం పట్టణానికి తాగునీరందించే నెల్లిమర్ల చంపావతీ నదీ తీరంలో నీరు కానరావడం లేదు. రామతీర్థం మాస్టర్ పంప్ హౌస్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ముషిడి పల్లి నీటి పథకంలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరందించలేని పరిస్థితి. వేసవి రానే వచ్చింది. ప్రజలకు తాగునీటి కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని పురపాలకులు చెపుతున్నా ప్రజలు మాత్రం కిలో మీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. పల్లెల్లో కంటే పట్టణాల్లో పరిస్థితి మెరుగని అంతా భావిస్తారని , వాస్తవంగా పల్లెలకంటే విజయనగరం పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారులోని పలు ప్రాంతాల పరిస్థితి ఇదేగా ఉంది. దాసన్నపేట, కె ఎల్ పురం ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి ఎదురు చూపులు చూస్తూ పడిగాపులు పడుతున్నారు.