వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందా ?
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 16
నోవెల్ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షా 37 వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మందికి ఆ వైరస్ సంక్రమించింది. కానీ ఇప్పటి వరకు ఆ వైరస్ సోర్స్ ఏంటో తెలియలేదు. చైనాలోని వుహాన్‌లో తొలి కేసులు నమోదు అయినా.. ఇంతకీ ఆ వైరస్ ఎలా పుట్టిందో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. సహజసిద్ధంగా ఆ వైరస్ జంతువుల నుంచి వ్యాపించిందా లేక వుహాన్ ల్యాబ్‌లో దాన్ని తయారు చేశారా అన్న డౌట్లు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వుహాన్‌లో ఉన్న బీఎస్ఎల్-4 ల్యాబ్‌లో ఆ వైరస్ పుట్టినట్లు కొన్ని రూమర్లు చెక్కర్లుకొడుతున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన ఫాక్స్ మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దాంట్లో వుహాన్ ల్యాబ్‌లోనే ఆ వైరస్ పుట్టినట్లు ఓ స్టోరీని ప్లే చేశారు. చాలా వరకు అమెరికన్లు ఇదే నమ్ముతున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. కానీ అది సహజసిద్దమైన వైరస్ అని తేల్చారు. అయితే బుధవారం వైట్‌హౌజ్‌లో జరిగిన మీడియా సమావేశంలో.. ఫాక్స్ రిపోర్టర్ జాన్.. అధ్యక్షుడు ట్రంప్‌ను వుహాన్ ల్యాబ్ గురించి ప్రశ్నించారు. వుహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో.. వైరస్ ఓ ఇంటర్నీకి సోకిందని, ఆ తర్వాత ఆ రీసర్చ్ స్కాలర్ నుంచి ఆ వైరస్ వుహాన్ మార్కెట్లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌కు వ్యాపించినట్లు ఫాక్స్ కథనం చెబుతోంది. దీని గురించి రిపోర్టర్ జాన్.. ట్రంప్‌ను అడిగారు. వైరాలజీ ల్యాబ్‌లో పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వైరస్ బయటకు పొక్కినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోందని రిపోర్టర్ తెలిపారు. దీనిపై ట్రంప్ కామెంట్ చేశారు. నువ్వు చెప్పినట్లుగానే వుహాన్ వైరాలజీ ల్యాబ్ గురించి చాలా వరకు కథనాలు వింటున్నామని, కానీ అవన్నీ కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోందని, దీనిపై పూర్తి విచారణ చేపడుతామని ట్రంప్ సమాధానం ఇచ్చారు. చైనా దేశాధ్యక్షడు జిన్‌పింగ్‌తో ల్యాబ్ గురించి చేసిన చర్చను తానేమీ చెప్పదలుచుకోలేదన్నారు. ల్యాబ్ గురించి జరిగిన చర్చను ఇప్పుడు చెప్పడం సరైంది కాదు అని ట్రంప్ అన్నారు. జీవాయుధాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో వుహాన్ ల్యాబ్‌లో వైరస్‌ను సృష్టించలేదని ఫాక్స్ తన కథనంలో పేర్కొన్నది. కానీ వైరస్‌ల నియంత్రణలో అమెరికాతో సమానంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం వుహాన్ ల్యాబ్‌లో పరీక్షలు చేపట్టినట్లు కథనంలో వివరించారు. పరిశోధశాలలో సరైన సేప్టీ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోందని పేర్కొన్నది. వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో ఎటువంటి వైరస్‌ను తయారు చేయలేదని గత ఫిబ్రవరిలో చైనా స్పష్టం చేసింది.