తాంసి మండలంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు వల్ల పలువురు రైతులు వ్యవసాయ భూములు కోల్పోయారు. ఈ భూమి విస్తీర్ణం 8.10 ఎకరాలు ఉంటుంది. ప్రాజెక్టు పూర్తైనా రెండేళ్లుగా బాధితులు పరిహారం కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులంతా చిరు రైతులే. వీరికి ఆర్ధిక వనరు సదరు పొలాలే. ఈ విషయం తెలిసీ సంబంధిత అధికారయంత్రాంగం స్పందించడం లేదు. దీంతో భూములు కోల్పోయినవారు సతమతమవుతున్నారు. వాస్తవానికి 2016 నుంచీ బాధితులు పరిహారం చెల్లించాలని అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. ఈ విషయమై న్యాయస్థానంలో కేసు ఉందని చెప్తూ మొదట్లో అధికారులు జాప్యం చేశారు. తరవాత న్యాయస్థానం పరిహారం ఇవ్వాలని ఆదేశించినా పట్టించుకునే వారు కరవయ్యారు. బాధితులు కోర్టు తీర్పు ప్రతులను పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం దక్కడంలేదు. ఇక ప్రజావాణిలో అర్జీలు సమర్పించినా ఫలితం లేకుండా పోతోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు బజార్‌హత్నూర్ మండలం దేగామ జలాశయం వల్ల ఈ ఊరిని ముంపు గ్రామంగా గుర్తించారు. స్థానికులను మరో చోటికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే వీరికి ఇప్పటికీ శాస్వత నివాసం చూపలేదు. దాదాపు పదేళ్లుగా 130 కుటుంబాలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారి ఆవేదన అరణ్య రోదనగానే మారింది. ముంపు భూములకు పూర్తి స్థాయిలో పరిహారం లభించకపోవడంతో బాధితులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఊళ్లు వదలిన వారికి పునరావాసం లభించక నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారయంత్రాంగ నిర్లక్ష్యం.. నిధుల లేమి వారి పాలిట శాపంగా మారింది. ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్లు అరుగుతున్నా పట్టించుకునే వారే లేరని బాధితులు తల్లడిల్లుతున్నారు. న్యాయస్థానాల ఆదేశాలనూ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు నిర్మించింది. నిర్మల్ జిల్లాలో స్వర్ణ, కడెం, గడ్డెనవాగు ప్రాజెక్టులను, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుమురం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్, ప్రాణహిత-తుమ్మిడిహేటి, మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి, నీల్వాయి..ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడి వాగు, దేగామ, బోథ్ ప్రాజెక్టులతో పాటు అనేక చెరువులు నిర్మించారు. ఈ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు, ఇళ్లు కోల్పోయిన గ్రామస్థులు పరిహారం కోసం ఇప్పటికీ పడిగాపులు పడుతున్నారు. అధికారులు తమ సమస్యపై దృష్టి సారించి సత్వరమే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తిచేస్తున్నారు.