మండుతున్న నిత్యావసరాలు
మెదక్, ఏప్రిల్ 17
మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఆకు కూరలకు సైతం అదిరిపోయే ధరలు ఉండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా టమాటా రూ.20 తప్పించి మిగతా కూరగాయల ధరలు కిందకు దిగి రావడం లేదు. పచ్చి మిర్చి కిలో రూ.60, బీరకాయ రూ.80కి చేరుకోగా, క్యారెట్ ఏకంగా రూ.80కు అమ్ముతున్నారు. మిగతా కూరగాయలు రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. బెండకాయ రూ.80, సోరకాయ ఒక్కటి రూ.20, చిక్కుడు కాయ రూ.80కు అమ్ముతున్నారు. ఆకు కూరలు కట్ట ఒకటి రూ.10కి అమ్ముతుండగా, కొత్తిమీర కట్ట గతంలో రూ.20 నుంచి ప్రస్తుతం రూ.50కి పెరిగింది. కూరగాయలు కొంటే ఉచితంగా ఇచ్చే కరివేపాకు కనీసం రూ.10కి తక్కువ లేకుండా అమ్ముతున్నారు.లాక్‌డౌన్ పొడిగింపుతో అందరూ అప్రమత్త మయ్యారు. అన్నింటికంటే ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కాస్తంత ఉన్నవారు నెలరోజులకు సరిపడా సరుకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పదిరోజులకైనా సిద్ధం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. దీంతో వ్యాపారులు ధరల నియంత్రణలో కట్టు తప్పుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఈ మధ్య స్వచ్ఛంద సంస్థలు గుత్తగా పెద్ద మొత్తంలో సరుకులు కొని పంచుతుండడంతో వ్యాపారులు వారికిస్తేనే ఒకేసారి గుత్తగా బిజినెస్ ఉంటుందని సామాన్యులకు అసలు సరుకులే లేవని అంటుండగా బతిమిలాడితే అడ్డగోలు ధరలు చెబుతుండడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి.కందిపప్పు రూ.70 నుంచి రూ.120కి పెరగ్గా, పెసర పప్పు రూ.80 నుంచి రూ.130, మినప్పప్పు రూ.110, రుచిగోల్డ్ వంట నూనె రూ.65 నుంచి రూ.100కు పెరిగింది. ఫ్రీడమ్ ఆయిల్ రూ. 92 నుంచి రూ.110కి, పల్లినూనె రూ.135, వేరుశనగ రూ.95 నుంచి రూ.110, చింతపండు రూ.175 నుంచి రూ.250కి పెరిగింది., చక్కర రూ.37 నుంచి 45-50కి పెంచేశారు. వెల్లుల్లి రూ. 100 నుంచి రూ. 120, అల్లం కేజి రూ.80 నుంచి రూ.120, కోడిగుడ్డు రూ.4.50 ఉండగా ప్రస్తుతం గ్రామాల్లో రూ.6కు చేరింది. ఉల్లిగడ్డ రూ.30కి కిలో అమ్ముతున్నారు.నిన్న మొన్నటి వరకు రోడ్ల వెంట ఉన్న టిఫిన్ బండ్లు, హోటళ్లు ఇప్పుడు మూతపడటంతో అందరు ఇంటి రుచులకు పరిమితమయ్యారు. ఉదయం టిఫిన్‌లు సైతం ఇంటిలోనే తయారు చేసుకోవడంతో గోధుమపిండి, రవ్వ వంటి టిఫిన్ వంట పదార్థాలు మార్కెట్‌లో లభించడం లేదు. ఏ దుకాణంలో అడిగినా ప్రస్తుతం లేవనే సమాధానం వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న నిత్యవసరాలకు కొరత ఏర్పడిందని, మరో మూడు, నాలుగు రోజులు గడిస్తే అవి కూడా దొరికే పరిస్థితి లేదని వెల్లడిస్తున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోవడంతోనే ధరలు పెరిగాయని, తాము తెచ్చినా అధిక ధరలు చెల్లించి తేవాల్సి వస్తోందని కిరాణా వ్యాపారులు పేర్కొంటున్నారు. అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. మొదట ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్14తో ముగుస్తుంది. మరో దఫా ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు మరింత పెరగనుండడంతో వాటిని ఎలా కొనుగోలు చేసేదని సామాన్యులు నిట్టూరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రేషన్‌షాప్‌ల సబ్సిడీ ధరల్లో నిత్యావసరాలు పంపిణీ చేయాలని పేద, మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు.