కరోనా వేళ... శాటిలైట్ ఫోటోస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17
చైనాలోని వుహాన్ సిటీలో గత ఏడాది చివరిలో పుట్టిన కరోనా వైరస్ కొన్ని నెలల్లోనే ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. దాదాపు మూడున్నర నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు లక్షా 35 వేల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మందగమనంలో ఉన్నా సరే ముందు ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో అన్ని దేశాలకు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచించాయి. దేశ, విదేశాల విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. థియేటర్లు, మాల్స్ మూతపడిపోయాయి. పరిశ్రమలు, ఆఫీసులు అన్నింట్లో వర్క్ ఆగిపోయింది. మెజారిటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ చేయించుకుంటున్నాయి. ఆఖరికి లోకల్ గా కూడా ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఇళ్లకు పరిమితమై పోవడంతో ప్రపంచమంతా ఓ ఎడారిలా మారింది. మన హైదరాబాద్ సిటీ సహా పలు ప్రముఖ పట్టణాలు లాక్ డౌన్ తర్వాత ఎలా కనిపిస్తున్నాయన్నది పోలీసులు డ్రోన్లతో వీడియో తీసి.. రిలీజ్ చేశారు. మరి ప్రపంచంలో నిత్యం వేలాది పర్యాటకులతో కలకలలాడే కొన్ని ఫేమస్ ప్లేసులు ఎలా ఉన్నాయన్నది నాసా, టూ ప్లానెట్ ల్యాబ్స్ ఇంక్ సంస్థలు అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలను రిలీజ్ చేశాయి. వాటిని ఒకసారి చూద్దాం. కరోనా పుట్టిన వుహాన్ సిటీ.. చైనాలోని వుహాన్ సిటీ 2019 డిసెంబరు చివరిలో తొలి కరోనా కేసును గుర్తించారు. వైరస్ సోకిన వారు దగ్గినా, తుమ్మినా, ముట్టుకున్నా కూడా పక్కవారికి అంటుకునే వ్యాధి కావడంతో గట్టిగా రెండు వారాల్లోనే భారీ సంఖ్యలో జనం జబ్బుపడ్డారు. వుహాన్ సిటీలో 2020 జనవరి 13న తొలి కరోనా మరణం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు వారాలకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వ్యాధి తీవ్రత గుర్తించిన చైనా ప్రభుత్వం జనవరి 23న వుహాన్ సిటీలో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ రెండు ఫొటోలు వుహాన్ సిటీలోని రద్దీగా ఉండే ఇంగ్వుఝో యాంగ్జ్ నదిపైనున్న బ్రిడ్జి ప్రాంతంలో తీసినవి. మొదటిది జనవరి 12న, రెండోది లాక్ డౌన్ తర్వాత జనవరి 28న అంతరిక్షం నుంచి ఉపగ్రహాలు క్లిక్ చేసిన ఫొటోలు ఇవి. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే మక్కా..ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లి పవిత్రమైన కాబాను సందర్శించాలని కోరుకుంటారు. ఈ పవిత్ర ప్రార్థనా స్థలానికి ఏటా జూలై – ఆగస్టు మధ్య హజ్ యాత్ర పేరిట సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారు. ఎడారి దేశంలో ఉండే ఈ ప్రాంతం కూడా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ నెల రోజుల్లోపే ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో ఫిబ్రవరి 27నే సౌదీ సరిహద్దులను మూసేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మక్కా, మదీనాల్లో ప్రార్థనలను నిలిపేసింది సౌదీ. వెలవెలబోతున్న వెనీస్ నగరం.. కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అయినా.. ఫిబ్రవరి చివరి కల్లా ఇటలీ ఈ మహమ్మారికి ప్రపంచంలోనే అతి పెద్ద హాట్ స్పాట్ గా మారింది. ట్రావెల్, టూరిజానికి కేరాఫ్ అడ్రస్ లాంటి ఆ దేశంలో విదేశాల నుంచి రాకపోకలు ఎక్కువ కావడంతో.. కొద్ది రోజుల్లోనే కరోనా బారినపడిన వారి సంఖ్య వేలల్లో నమోదైంది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి మార్చి 8న ఆ దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇటలీ ప్రధాని. దీంతో ఎప్పుడూ పర్యాటకులతో కలకలలాడుతూ కనిపించే వెనీస్ సిటీ పూర్తిగా వెలవెలబోయింది. ఇప్పటి వరకు ఇటలీలో లక్షా 65 వేల మంది కరోనా బారినపడగా.. 21 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాల్ట్ డిస్నీ పార్క్ క్లోజ్ అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మార్చి మొదట్లో కరోనా కేసులు మొదలైన ఆ దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆరున్నర లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 28 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. కరోనా కంట్రోల్ విషయంలో అలస్యంగా మేలుకున్న అమెరికా లాక్ డౌన్ విషయంలో ఆర్థికంగా ఏమవుతామోనన్న లెక్కలు వెసింది. లేటుగా తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించారు అధ్యక్షుడు ట్రంప్. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద థీమ్ పార్క్ అయిన ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ పార్క్ ను మార్చి 18న ఆ సంస్థ క్లోజ్ చేసింది. వేలాదిగా పిల్లలు పెద్దలతో కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ కార్ల తయారీ యూనిట్.. కరోనా లాక్ డౌన్ తో కంపెనీలపై ఎఫెక్ట్ పడింది. ఉద్యోగులు బయటకు రాలేని పరిస్థితి నెలకొనడంతో జర్మనీ కార్ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ చైనాలోని టైన్జిన్ లో ఉన్న తన అతి పెద్ద కార్ల తయారీ యూనిట్ ను మూసేసింది. అయితే కార్ల తయారీ నిలిపేసిన ఆ కంపెనీలో.. కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కు అవసరమైన వెంటిలేటర్లను, ప్రొటెక్షన్ మాస్కులు తయారు చేయాలని జర్మనీ సూచించింది. దీంతో ప్రస్తుతం వాటి ఉత్పత్తి జరుగుతోంది.