రెండింతలు పెరిగిన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ విక్రయాలు
బెంగళూరు ఏప్రిల్ 17
కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ దంపతుల మధ్య ప్రేమకు లాక్ పడటం లేదు. అయితే కరోనా ప్రబలుతున్న ఆపత్కాలంలో గర్భం దాల్చకుండా దంపతులు ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో దంపతులు ఇళ్లకే పరిమితం కావడంతో గర్ఫనిరోధక మాత్రలు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్‌కు డిమాండు గణనీయంగా పెరిగింది. కరోనా వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో అనుకోకుండా గర్భం దాల్చకుండా దంపతులు ముందుజాగ్రత్త చర్యగా గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు ప్రెగ్నెన్సీ కిట్‌లను కొనుగోలు చేస్తూ గర్భం దాల్చామా అనే భయంతో స్వయంగా పరీక్షించుకుంటున్నారు.లాక్‌డౌన్ సమయంలో గతంలో కంటే 50 శాతం గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్‌ల విక్రయాలు 50 శాతం పెరిగాయని బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లోని అపోలో ఫార్మసీ ఉద్యోగి చెప్పారు. గతంలో నెలకు 14 నుంచి 15 గర్భనిరోధక మాత్రల బాక్సుల విక్రయాలు సాగగా, లాక్‌డౌన్ సమయంలో వీటి అమ్మకాలు మూడు రెట్లు పెరిగిందని మరో మెడికల్ షాపు యజమాని చెప్పారు. బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్, పూణే నగరాల్లోనూ గర్భనిరోధక మాత్రల విక్రయాలు జోరందుకున్నాయి. ముంబై నగరంలో కండోమ్స్ విక్రయాలు గణనీయంగా పెరిగాయని తాజా విశ్లేషణలో తేలింది. జనవాస ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఓ ఫార్మాసిస్ట్ చెప్పారు. కరోనా ప్రబలుతున్న సమయంలో గర్భనిరోధానికి చేపట్టాల్సిన చర్యల గురించి పలువురు దంపతులు తమను సంప్రదిస్తున్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ హేమ చెప్పారు.