ఆంధ్రప్రదేశ్ లో వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షలు
ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం
తాడేపల్లి ఏప్రిల్ 17
వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను తీసుకొచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ కిట్లను ఏపీకి తరలించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్ కిట్లు వడంతో ఆంధ్రప్రదేశ్ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు చెప్పారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహణలో ఏపీ దేశంలో టాప్–5లో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.