YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బావులు కాదు..ప్రమాదాల నిలయాలు..

బావులు కాదు..ప్రమాదాల నిలయాలు..

రహదారుల పక్కన తవ్విన వ్యవసాయ బావుల వల్ల పలు అనర్ధాలు సంభవిస్తున్నాయి. ఈ బావులు ప్రమాదాలకు కారణమవుతుండడంతో పాటూ మృత్యుపాశాలుగానూ మారుతున్నాయి. దీంతో వీటిని గుర్తించి పూడ్చివేయాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నిజామాబాద్‌లో రోడ్ల పక్కన ఉన్న ప్రమాదకర బావులను గుర్తించినా కామారెడ్డి జిల్లాలో మాత్రం ఈ పని పూర్తికాలేదని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా రహదారుల పక్కన 30 బావులు ప్రమాదకరంగా ఉండొచ్చని సమాచారం. ఈ మేరకు అధికారులు కలెక్టరేట్‌కు వివరాలు కూడా అందించినట్లు తెలుస్తోంది.  అయితే స్థానికంగా ప్రమాదకర బావులు 30 కంటే ఎక్కువే అని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. వాస్తవానికి రెట్టింపు సంఖ్యలో బావులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా మండలాల పరిధిలోని గ్రామాల వారీగా ఎన్ని బావులుంటాయన్నది మాత్రం పరిశీలించి నివేదిక తయారు చేయలేదని అధికారులపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

ప్రజల ఆవేదన గ్రహించిన కలెక్టర్ ఇలాంటి బావులకు సత్వరం కంచె వేయాలని, అవసరమైతే పూడ్చివేయాలని పంచాయతీరాజ్‌, రోడ్లు,భవనాల శాఖల అధికారులకు సూచించారు. కలెక్టరు చెప్పినా ఇప్పటి వరకు సదరు బావుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెండోరా ఉదంతం నేపథ్యంలో రహదారుల పక్కన ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావులను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు భావించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సిరిసిల్ల జిల్లా కలెక్టరు రహదారుల పక్కన ఉన్న బావులను గుర్తించి పూడ్చివేయడమో, రక్షణ గోడలు నిర్మించడమో చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఈ అంశంపై కామారెడ్డి జిల్లాలో నిర్లక్ష్యం, ఉదాసీనత అలముకోవడంపై ప్రజల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ప్రమాదకర బావులను పూడ్చేయాలని అంతా కోరుతున్నారు.

Related Posts