కుటుంబాల్లో లాక్ డౌన్ చిచ్చు
హైద్రాబాద్, ఏప్రిల్ 18
కొన్ని కుటుంబాల్లో మాత్రం ‘లాక్‌డౌన్ కాలం’ చిచ్చుపెడుతోంది. ఈ ‘విరామ కాలం’ భార్యాభర్తల మధ్య అసహనాన్ని రగిలిస్తోంది. ముద్దొచ్చే పిల్లల అల్లరే తల్లిదండ్రులకు రానురాను విసుగు తెప్పిస్తోంది.కొసరి కొసరి వడ్డించే భార్యలో ఈ మార్పు భర్తకు చికాకు పుట్టిస్తోంది. ఆఫీసు నుంచి రాగానే టీ, స్నాక్స్‌తో ఆప్యాయంగా పలకరించిన భార్యేనా ఈమె అన్న అసహనం భర్తలో పెరుగుతోంది. వర్క్ ఫ్రంలో హోంలో భాగంగా పొద్దంతా కంప్యూటర్‌లో తలదూర్చిన వారికి ఇంట్లో పిల్లలు చేసే గోల పెద్ద సంకటంగా మారింది. దీంతో తమ అసహనాన్ని ఇంట్లోని ఇతరులపై చూపిస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడుతున్నారు. చేయిచేసుకుంటున్నారు. భర్తలపై భార్యలు.. భార్యలపై భర్తలు.. భార్యాభర్తలు కలిసి ఇంట్లోని పెద్దవాళ్లపై కేకలు పెడుతున్నారు. కొందరి ఇళ్లలో ఇవి శ్రుతిమించుతుండటంతో బలవన్మరణాలకూ దారితీస్తున్నాయి. రాచకొండ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఇటీవల ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా కుటుంబంలో పెరిగిన అసహనం, గొడవే ఆత్మహత్యలకు కారణం. కరీంనగర్ జిల్లాకు చెందిన సుమతి, అనూష మంచి స్నేహితులు. రేషన్ బియ్యం, కూరగాయలకోసం బయటకు వచ్చిన ఆ ఇద్దరు ఇంటికి చెప్పిన సమయం కన్నా ఆలస్యంగా వెళ్లారు. ఇది అటు సుమతి భర్తకు, అనూష భర్తకు ఆగ్రహం తెప్పించింది. గొడవపడ్డారు. ఆ ఇద్దరు మహిళలు ఇంట్లోంచి వచ్చేశారు. అనూష తనతో పాటు తన 6ఏళ్ల కూతురు మహేశ్వరిని తీసుకొని వచ్చింది. ముగ్గురు కలిసి హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తొలుత చిన్నారికి విషం ఇచ్చి చంపేశారు. అనంతరం ఇద్దరూ మర్రిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాంపేటలో భార్యభర్తలు ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పలువురిని కలిచివేసింది. కొంతకాలంగా బంగారం విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఇద్దరూ క్షణికావేశాలకు లోనై చెరో గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కాగా లాక్‌డౌన్ నిబంధనలతో గొడవలున్నా బయటకు రాలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక వారిలో వారే కుమిలిపోతూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ముగిసి న వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల్లో అధిక శాతం గృహ హింస, వేదింపుల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.