YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ..

పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ..

సంప్రదాయ పంటలతో సతమతం అయ్యేకంటే ఇతర పంటల సాగే మేలని రైతులు గ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యానవన పంటలపై దృష్టి సారించడంతో పాటూ కూరగాయల సాగును ఆశ్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో కర్షకులు కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ నీరు, పెట్టుబడులతోనే ఎక్కువ దిగుబడి ఇచ్చే ఈ తరహా పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కూరగాయలు స్వల్పకాలిక పంటలు. వారాల వ్యవధిలోనే కాపుకు వచ్చే రకాలూ ఉంటాయి. పైగా తక్కువ పెట్టుబడికే ఎక్కువ దిగుబడినిస్తాయి. దీంతో రైతులు ఈ పంటలను విస్తృతంగా సాగుచేస్తూ ఆర్ధికంగా లాభపడుతున్నారు. కూరగాయలతో పాటూ ఆకు కూరలనూ విరివిగా పండిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. సాధారణంగా మే, జూన్‌, జూలైల్లో పండించిన కూరగాయలకు ధర బాగానే ఉంటుంది. టమాట, బీర, గోరుచిక్కుడు లాంటి పంటలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. జూన్‌ మొదటి వారంలోగా ఈ రకాలు మార్కెట్‌కు వచ్చేటట్లుగా సాగు మొదలు పెడితే రైతులకు ప్రయోజనకరమని నిపుణలుు అంటున్నారు.

 షేడ్‌నెట్‌ ఉన్న రైతులకు ఈపంటలను సాగు చేసుకోవటం ఎంతో అనుకూలమని చెప్తున్నారు. ఇదిలాఉంటే ఈ తరహా పంటల సాగును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఉద్యానశాఖ అధికారులు  ఒక్క ఖమ్మం జిల్లాలోనే 50 మిర్చి నర్సరీలకు లైసెన్సులు మంజూరు చేశారు. మిరప నారు పెంచుకునే సమయంలో తప్ప ఆ తర్వాత ఇవన్నీ చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా షేడ్‌నెట్‌ ఉన్న నర్సరీలే. దీంతో వేసవిలో వీటిలో కూరగాయల సాగును భేషుగ్గా చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా టమాటాలతో పలు తీగ జాతి పంటలు వేసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయని సూచిస్తున్నారు. షేడ్‌నెట్‌ అవకాశం లేని రైతులు బీర, సొర, కాకర, కీరదోస, పప్పుదోస, పొట్ల, బుడంకాయల్లాంటివి వేసుకోవాలని వివరించారు. ఎండ ఎక్కువైనా ఇవి తట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ గోరుచిక్కుడుకు అనుకూలమని అధికారులు స్పష్టంచేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనల ప్రకారం కూరగాయల సాగు చేస్తే రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

Related Posts