లాక్ డౌన్ ఒక్కటే సమస్య పరిష్కారం కాదు
హైద్రాబాద్, ఏప్రిల్ 18
కరోనాతో యావత్ ప్రపంచం బెంబలెత్తి పోతోంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. ఇక రాష్ట్రాలయితే కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటంతో అన్ని కార్యకలాపాలు స్థంభించి పోయాయి. కరోనా నియంత్రణ కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఏకమైనట్లే కన్పిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తప్ప మిగిలిన చోట్ల అధికార పార్టీకి ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయి. సోనియాగాంధీ కూడా క్లిష్ట సమయంలో రాజకీయాలను వదిలేసి సూచనలు ఇస్తుండటం మంచి పరిణామంగా భావిస్తున్నారు.కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న చర్యల్ని ప్రశంసిస్తూ.. ‘లాక్ డౌన్’ ఒక్కటే మందు కాదన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు పీపుల్ స్టార్. ‘ భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అనే గొప్ప నిర్ణయంతో అద్భుతంగా కరోనాను కట్టిడి చేశారు. అయితే ఈ లాక్ డౌన్‌ను దశల వారీగా పొడిగించుకుంటూ పోవడమే కాకుండా శాశ్వత పరిష్కారం దశగా ఆలోచన చేయాలి. ఎందుకంటే.. లాక్ డౌన్ అంటే అదో మంత్రం కాదు.. వెంటనే కరోనా పారిపోవడానికి. ఈ లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు. ముందు ఈ భయంకరమైన వైరస్‌కి మందులు కనిపెట్టాలి. అంచెలంచెలుగా లాక్ డౌన్‌ను సడలింపజేస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసి కూడా ఈ కరోనా మహమ్మారిని జయించగలుగుతున్నాం అనే భరోసాను ప్రజలకు కల్పించాలి ప్రభుత్వాలు.మనిషి స్వేచ్ఛాజీవి.. స్వేచ్ఛగా బతకాలి అదే సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాలనకు గౌరవిస్తూ ముందుకు వెళ్లాలి. అలాంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాలా మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు.. ఉన్నవాళ్లు చాలా మంది లేని వాళ్లకి పెడుతున్నారు. రేపటి రోజున వాళ్ల ఇంట్లో సామాన్లు అయిపోతే పరిస్థితి ఏంటి? నేను బతకాలంటే స్వార్థం వస్తే అంతర్యుద్ధం ప్రారంభం అవుతుంది. తనకు ఆహారం దొరకనప్పుడు దోచుకోవడానికి కూడా వెనకాడడు మనిషి. ఒకర్నొకరు దోచుకుంటే ఆర్థిక యుద్ధం మొదలు అవుతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ను ఆ దేశాలు జయించాయి. దయచేసి ఈ వైరస్‌కి మందు కనిపెట్టేలా చేయండి.. మానవుడు మహా శాస్త్రవేత్త.. గుండెను తీసి గుండెను పెట్టిన వాడు అంతరిక్షంలో కాలు పెట్టినవాడు.. ఇలాంటి వ్యాధికి మందు కచ్చితంగా కనిపెట్టగలడు. స్వార్థంతో ఆలోచించి మందు కనిపెట్టడానికి ముందుకు రాని పారామెడికల్ కంపెనీలపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆవేశపూరితంగా మాట్లాడుతూనే ఆలోచింపజేసే కామెంట్స్ చేశారు ఆర్ నారాయణ మూర్తి.