మరో ప్యాకేజీకి రెడీ అవుతున్న కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. దీంతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. పేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం.. త్వరలోనే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది. వరల్డ్ బ్యాంక్ డెవలప్‌మెంట్ కమిటీ ప్లీనరీ 101వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న నిర్మలా సీతారామన్.. కరోనా పేషెంట్ల చికిత్స కోసం అవసరమైన ఔషధాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపారు.గత నెలలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని తెలిపిన సీతారామన్.. ఇందులో భాగంగా హైల్త్ వర్కర్లకు ఉచిత ఆరోగ్య బీమా, పేదలకు నగదు బదిలి, ఉచితంగా బియ్యం, గ్యాస్ పంపిణీని చేపడుతున్నట్లు వివరించారు. సంస్థలను ఆదుకోవడం కోసం ఆదాయపన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఆర్థిక సేవలు, కార్పొరేట్ వ్యవహారాల్లో సడలింపు ఇచ్చామన్నారు. మార్కెట్ అనిశ్చితిని నియంత్రించడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.స్పెషల్ రిఫైనాన్స్ ఫెసిలిటీలో భాగంగా ఆర్‌బీఐ రూ.50 వేల కోట్లను నాబార్డ్, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకులకు మళ్లించనుంది. రైతు రుణాల కోసం నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు అందిచనుండగా.. సిడ్బీకి రూ.15 వేల కోట్లు, ఎన్‌హెచ్‌బీకి అందించనుంది. ఈ నిధులతో రూరల్ సెక్టార్, సూక్ష్మ పరిశ్రమలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మొదలైన వాటికి నిధులు అందుతాయి.