YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీరుగారుతున్న లక్ష్యం

నీరుగారుతున్న లక్ష్యం

ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. రూ.కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు, వివిధ నీటి పథకాలు నిర్మిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. అయితే ప్రభుత్వ లక్ష్యానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో తూట్లు పడుతున్న పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా రూ.కోట్ల నిధులతో పైప్ లైన్లు వేసినా తాగునీరు అన్ని గ్రామాలకూ సమర్ధవంతంగా సరఫరా కావడంలేదని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. కొడిమ్యాల మండలం పరిధిలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోకి 31 గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల్లోని ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని ఎల్లమ్మ చెరువులో శుద్ధ జల పథకం ఏర్పాటు చేశారు. 2008లోనే రూ.12 కోట్లు మంజూరు అయ్యాయి.

నిధులు మంజూరు కావడంతో ప్రాజెక్ట్ పనులను కూడా ప్రారంభించారు. టెండర్ కైవసం చేసుకున్న కాంట్రాక్టర్‌ గుట్టపై పెద్ద ట్యాంకు, ట్యాంకులోంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్టర్‌ యంత్రాల భవనం నిర్మించారు. ఈ భవనంలోనే మోటార్లతో పాటూ ఇతరత్రా అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేశారు. చెప్యాలలో 60 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. దీనిలోకి గంగాధరలోని ఎల్లమ్మ చెరువు నుంచి శుద్ధ జలం సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామాలకు నీరు సరఫరా చేయాల్సిఉంది. ఈ క్రమంలో ఇక్కడినుంచే పైపులైన్లు వేశారు. అయితే రూ.12 కోట్లు సకాలంలో ఖర్చు చేయలేకపోయారు. దీంతో రూ.4 కోట్ల నిధులు వెనక్కి మళ్లిపోయినట్లు సమాచారం. నిధులు సంపూర్తిగా లేనందున ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి కాలేదు. ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేయాలని, నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుని గ్రామాలన్నింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని అంతా కోరుతున్నారు.

Related Posts