మందుబాబులకు కిక్ ఇచ్చే ధరలు.... లాక్ డౌన్‌లోనూ ఆగని లిక్కర్ దందా..
లాక్ డౌన్ వేళ మందుబాబులు చుక్క లేక అల్లాడిపోతున్నారు. మద్యం అలవాటు కొంతమందిలో మానసిక సమస్యలు తెస్తుంటే.. మరికొంతమందిని కుదురుగా కూర్చోనివట్లేదు. ఎక్కడ మద్యం దొరుకుతుందా అని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మందు బాబుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొంతమంది వైన్ షాప్స్,బార్ల యజమానులు రెచ్చిపోతున్నారు. మద్యాన్ని బ్లాక్ మార్కెట్‌కి తరలించి సాధారణ రేటు కంటే నాలుగైదింతలు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.120-రూ.180 మద్యం బీర్ ఇప్పుడు ఏకంగా రూ.450-రూ.500కి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో కర్ణాటక నుంచి తీసుకొచ్చి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.140 విలువ చేసే ఒక్క క్వార్టర్ సీసాను రూ.600కి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసినా.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు తెరపడలేదనే ప్రచారం జరుగుతోంది.