అల వైకుంఠపురంలో ఒకనాడు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా,.....
ఎక్కడి నుండో స్త్రీ ఏడుపు వినిపించింది. హృదయ విదారకమైన ఆ ఏడుపు విన్న నారాయణుడు కళ్ళు తెరిచి చూడగా లక్ష్మీదేవి యధావిధిగా తన పాదాలను ఒత్తుతూ ప్రసన్నవదనగానే అగుపించింది. మరి శోకతప్త ఎవరని అనుకుంటూ ఉండగా , ముఖమంతా వర్షించే మేఘం అలుముకున్నట్లు ఉండి, కన్నుల వెంట ధారాపాతంగా నీరు కారుతూ ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. లక్ష్మీనారాయణులు ఆ స్త్రీ మూర్తిని చూచి ఒక్క క్షణం స్థాణువులై, మళ్ళీ తేరుకున్న వారై, ఇద్దరూ ఒక్కసారిగా అన్నారు..' భూదేవి! ఏమిటిలా ఉన్నావు? ఎందుకిలా శోకిస్తున్నావు?' అని అడిగారు. లక్ష్మీదేవి, భూదేవి దగ్గరకు వెళ్ళి, "అమ్మ! ఏమిటి నీకీ దురవస్థ? ఎప్పుడూ కళ-కళలాడే నీ మోము ఇలా మబ్బు కమ్మినదేమిటమ్మ? హరిత,నీలి వర్ణాలతో శుభ్రవస్త్రగా ఉన్న నీ వస్త్రాలు ఇలా మకిలి పట్టిపోయాయి ఏమిటమ్మ? కోటాను కోట్ల జీవరాశులు నీయందు ఊపిరిపోసుకుంటాయే , మరి నీవు ఊపిరి తీసుకోవడంలో ఇంతగా కష్టపడుతున్నావేమి అమ్మ!? నీ శోకానికి కారణం ఏమిటమ్మ? అని అడిగింది?" అయిన భూదేవిని, అనునయిస్తూ, దేవి! నీ దుఃఖానికి కారణం ఎవరు? 'కృతయుగం'లో నిన్ను నిర్బంధించిన 'హిరణ్యాక్షుడి'ని 'వరాహ' అవతారము ఎత్తి వధియించి బంధవిముక్తురాలిని చేసితిని కదా!.., 'త్రేతాయుగము'న 'రామావతార'మెత్తి రాక్షసులను సంహరించి భూభారము తగ్గించితిని కదా!.. , 'ద్వాపరయుగము'న , 'కృష్ణావతారం'లో లోక కంటకుడైన నరకాసురుని, మన పుత్రుడే అయినా మిన్నకుండలేదు కదా!, ధర్మ రక్షణ చేశాను కదా!..నేటి నీ దుఃఖ కారకులు ఎవరు?, చెప్పుమని అడిగెను?. అంతట భూదేవి, 'స్వామి! నా బాధ ఏమని చెప్పుదును? నా దురవస్థకు కారణం నా బిడ్డలైన మానవులే. కొన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు అడవులను నరికేసారు. పర్యావరణానికి చేటు తెచ్చారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి, వివిధ రకాల ఆవిష్కరణలు అంటూ వాతావరణ కాలుష్యానికి కారకులయ్యారు. నదులు, సముద్రాలలోకి వ్యర్థాలను పంపి వాటినీ కలుషితం చేసేశారు. ఎక్కడ చూసినా మలినాలు, దుర్గంధాలు. స్వార్థం పెచ్చుమీరి పోయింది. ఈ మానవుని వల్ల మిగిలిన అన్ని జీవులకు సంకటముగనున్నది. ఒకటా,రెండా ఎన్నని చెప్పనుదేవా? మీకు తెలియనిది ఏమున్నది? భరించే కొద్దీ భారాన్ని పెంచుతున్నారు. మోయలేకున్నాను, సహించలేకున్నాను, భరింపలేకున్నాను. నా రూపు-రేఖలే మార్చేశారు.' అంటూ భోరున విలపించింది. అంతా విన్న జగన్నాథుడు ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఓదార్చి, ఆమెనుపంపి ఆలోచనలో పడ్డాడు. కొంతకాలం గడిచింది. పాలసముద్రంలో శేషశాయి పవ్వళించి ఉండగా సర్వాలంకార భూషితయై, పాల సముద్రముకన్న తేటగా, స్వచ్ఛంగా, శుభ్రమైన వస్త్రములు ధరించినదియైన మంగళరూపిణిగా భూమాత ప్రత్యక్షమైంది. ఆమెను అలా చూచిన లక్ష్మీనారాయణులు సంతసించిరి. కుశలప్రశ్నలు వేసుకునిరి. కానీ భూదేవి మోములో రేఖామాత్రంగా విచారమున్నట్లు గమనించిన లక్ష్మీదేవి, ఆమె విచారమునకు కారణం అడిగెను.భూదేవి 'ఏమని చెప్పెదనమ్మ, శ్రీవారు నా మొరను ఆలకించి నా సమస్యను పరిష్కరించారు. ప్రజలందరు ఇంటి వద్దనే ఉండుట వలన, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం లేదు. జనులందరూ శుభ్రము-శుభ్రము అనుచూ శుభ్రతకు పెద్ద పీట వేయుట వలన ఎక్కడ చూచినా స్వచ్ఛత కానవచ్చుచున్నది. కానీ, వారునూ నా బిడ్డలే కదమ్మ. 'కరోన' అంటూ ఆ మహమ్మారి బారినపడి కష్టపడుట, సుజనులు, దుర్జనులని భేదములేక భయము గుప్పిట బ్రతుకునీడ్చుట, ఇదేమి లీల? ' అని, స్వామి వైపు తిరిగి, 'స్వామి! ఇదియేనా మీ పరిష్కారము?' అని అడిగినది. అందుకు స్వామి, కొంత కలవరమంది, దేవి! నువ్వు వెళ్ళిన నాటి నుండి, ఈనాటి వరకు నేను ఎటుల నీ సమస్యను పరిష్కరించవలెనని విచారణలోనే ఉంటిని. దేవి! ఇది నేను చేసినది కాదు. ఇది కూడా మానవుని తప్పిదములోని భాగమే.' అని అనెను. స్వామి! మరి దీనికి పరిష్కారమే లేదా అని భూదేవి అడుగగా, ప్రతి సమస్యకు పరిష్కారము ఉంటుంది. కానీ దానికి సరియైన సమయం రావాలి అంతే. ద్వాపరయుగంలో మహాభారత యుద్ధ సమయంలో 'ద్రోణాచార్యుల'వారు నేలకూలగా, కోపోద్రిక్తుడైన అతని కుమారుడు 'అశ్వత్థామ' 'నారాయణాస్త్రాన్ని' ప్రయోగించెను. దాని ప్రభావము తగ్గువరకు, ఎక్కడి వారు అక్కడే కదలక-మెదలక ఉండిపోయిరి. ప్రస్తుతము అటువంటి జీవనమే కొంతకాలము ఈ మానవులు గడపక తప్పదు. దాని ప్రభావము తగ్గి బలహీన పడిపోవును. అచిరకాలములోనే ఔషధము రాగలదు. ప్రజలు సుఖ-శాంతులనొందగలరు. ధైర్యము వహింపమని పలికెను. భూదేవి సంతసించి అక్కడి నుండి వెడలెను.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో