విపక్షాల ఆందోళనతో 21వ రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే గురువారం రాజ్యసభ వాయిదా పడింది. తెదేపా, వైకాపా, కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడా తెదేపా సభ్యులు సభలోనే కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెదేపా సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్ ప్రయత్నించారు. ఈసందర్భంగా మార్షల్స్ తో టీడీపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చేది లేదని తెదేపా ఎంపీలు స్పష్టం చేయడంతో ఉద్రిక్తత చాలాసేపు కొనసాగింది. సభ వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని నినాదాలు చేశారు. అంతకుముందు టిడిపి వైకాపా, కాంగ్రెస్ సభ్యులు సభలో అరుస్తూ గందరగోళం సృష్టించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నినాదాలు ఆపలేదు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోను ఎంపీలు సభ లోపలే కూర్చుని నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా విభజన హామీల కోసం అదే తీరులో సభలోనే కూర్చుని ఆందోళన చేపట్టారు. వారిని బయటకు తీసుకువెళ్లేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ధర్నా చేస్తుంటే వారికి మద్దతుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆ పార్టీ లోక్ సభ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగించారు.