మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ముంబై, ఏప్రిల్ 20
బంగారం పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ఈరోజు పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలోనూ పసిడి వెలవెలబోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.44,200కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,510కు పడిపోయింది.పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.41,150కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.72 శాతం దిగొచ్చింది. 1690 డాలర్ల కిందకు పడిపోయింది. దీంతో ఔన్స్‌కు 1686.50 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 15.24 డాలర్లకు క్షీణించింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర మిశ్రమంగా కదిలింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.41,980కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.90 తగ్గుదలతో రూ.44,550కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.41,150కు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.