నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్లు... ఇవాళ లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 578 పాయింట్ల లాభంతో 33,597 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల మేర పుంజుకుని 10,325 వద్ద స్థిరపడ్డాయి. అన్ని రంగాలకు సంబంధించిన షేర్లు లాభాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రెండు తప్ప మిగిలిన కంపెనీలన్నీ లాభాలతో ముగిశాయి. లాభపడిన వాటిలో ఎస్బీఐఎన్ (4.66%), టాటా స్టీల్ (3.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.52%), కొటక్ బ్యాంక్ (3.36%), హీరో మోటో కార్ప్ (3.11%) ముందున్నాయి. భారతీ ఎయిర్‌టెల్(0.14%), పవర్ గ్రిడ్ (0.15%) స్వల్పంగా నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అందించిన గుడ్ న్యూస్‌తో దేశీయ సూచీలు లాభాల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఆర్‌బీఐ సమీక్షలో కీలక నిర్ణయాలను వెల్లడించిన అనంతరం మదుపర్లలో ఉత్సాహం కొనసాగుతోంది. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 10,300 పైన ట్రేడ్ అవుతుండటం విశేషం. ఆర్‌బీఐ సమీక్షపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు ఉదయం నుంచే కొనుగోళ్ల బాట పట్టారు. దీనికి తోడు అంతర్జాతీయం మార్కెట్లు కూడా సానుకూల ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలం చేకూర్చింది.అందరూ ఊహించినట్టే కీలక పాలసీ రేటు విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. పాలసీ రేటును 6 శాతం వద్ద యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఆగస్టు తర్వాత వరసగా నాలుగోసారి ఆర్‌బీఐ పాలసీ రేటును మార్చకపోవడం విశేషం. రెపో రేటు 6.25%, రివర్స్ రెపో రేటు 5.75% యథావిథిగా కొనసాగించింది.