అమెరికాలో విదేశీయులకు నో ఎంట్రీ
న్యూయార్క్, ఏప్రిల్ 22
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ రద్దు చేస్తున్నట్లు తన ప్రకటననలో పేర్కొన్నారు. ఇమిగ్రేషన్‌ను రద్దు చేయడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇప్పుడే సంతకం చేశానని తెలిపారు. కంటికి కనిపించని శతృవు దాడి చేస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేసినట్లు ట్రంప్ చెప్పారు.అమెరికన్ల ఉద్యోగాలు రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు ట్రంప్. అయితే తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ట్రంప్ మొదటి నుంచి కూడా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మరి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగానే ఉంచుతారా లేక పూర్తిస్థాయిలో ఉంటుందా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.మరోవైపు అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా విస్తరిస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వైరస్ పుట్టిన చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. దీనికంతటికీ చైనాయే కారణమంటూ ఆ దేశంపై విచారణకు ఆదేశించారు