శానిటైజర్ తో లిక్కర్
అనంతపురం, ఏప్రిల్ 22
లాక్‌డౌన్ వేళ నాటుసారా, లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. మద్యానికి డిమాండ్ పెరగడంతో.. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఏకంగా ఇళ్లలోనే దుకాణం పెట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కొందరు సారా కాస్తుంటే.. మరికొందరు కల్తీ లిక్కర్ తయారు చేసే పనిలో ఉన్నారు. తిరుపతిలో ఓ ఇంట్లో నాటుసారా తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇటు అనంతపురం జిల్లాలో శానిటైజర్‌తో లిక్కర్ తయారు చేస్తూ కొంతమంది పోలీసులకు చిక్కారు.అనంతపురం .కమలానగర్‌లోని రఘువీరా కాంప్లెక్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా నలుగురు కల్తీ లిక్కర్ తయార చేసి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ మరో ముగ్గురితో కలిసి ఈ అక్రమ దందా చేస్తున్నారు. సమాచారం రావడంతో ఓ వ్యక్తిని సారా కొనుగోలు చేసేందుకు పంపారు. ఆ వ్యక్తి సారా కొనుగోలు చేస్తున్న సమయంలో దాడులు జరిపారు.ఎక్సై్జ్ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 శానిటెజర్ల సీసాలు, సారా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సారా, కల్తీ లిక్కర్‌లు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అలాంటి వారిపై నిఘా పెంచామంటున్నారు.