విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరనున్నట్లు కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ అధినేత నుంచి టికెట్ ఇస్తామన్న హామీ లభిస్తే వచ్చే నెల రెండోవారంలో ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని రవి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు జనసేన నేతలు సైతం ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రవి, జనసేన తరఫున బరిలో నిలిస్తే తిరిగి అదే గెలుపు పునరావృతమవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. దీంతో రవిని పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనతో వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రవి అనుచరులు మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రవిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు 2009లో ఆయనతోపాటు పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధా ప్రయత్నిస్తుండగా, మరో వైసీపీ నేత కొలుసు పార్థసారథి అంత సుముఖంగా లేనట్లు సమాచారం. వచ్చే నెలలో జగన్‌తో భేటీ అయిన తర్వాత రవి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేవినేని, యలమంచిలి కుటుంబాల నడుమ సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది. కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా దేవినేని నెహ్రు, యలమంచిలి రవి తండ్రి నాగేశ్వరరావు హోరాహోరీగా తలపడేవారు. నాగేశ్వరరావు తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతూ వచ్చారు. టీడీపీ ఆవిర్భావంతో నెహ్రు ఆ పార్టీలో చేరి కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1989, 1994 ఎన్నికల్లో నెహ్రుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో నెహ్రు కాంగ్రెస్‌లోకి చేరడంతో నాగేశ్వరరావు టీడీపీలోకి వచ్చారు. 1999లో కంకిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా నెహ్రుపై పోటీ చేసి చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించారు. తండ్రి మరణించిన తర్వాత రవి కూడా నెహ్రు కుటుంబంతో రాజకీయ వైరాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ తరఫున బరిలో నిలిచిన రవి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రుపై విజయం సాధించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రవి రానున్న ఎన్నికల్లో అదే స్థానం నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే తమ కుటుంబానికి పెనమలూరు నియోజకవర్గంతోనూ అనుబంధం ఉండటంతో అక్కడి నుంచి అవకాశం కల్పించినా పోటీ చేయాలన్న ఉద్దేశంతో రవి ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే రవి రాకను పెనమలూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న కొలుసు పార్థసారథి అంత సుముఖంగా లేనట్లు సమాచారం. మరోవైపు తూర్పు నియోజవకర్గం నుంచి బొప్పన భవకుమార్, ఎంవీఆర్ చౌదరి వైసీపీ టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ‘తూర్పు’ వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. రానున్న రోజుల్లో పార్టీలో మిగిలేదెవరు.. కొత్తగా వచ్చేదెవరో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.