YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని తరలింపు ఆపే శక్తి ఎవరికి లేదు

రాజధాని తరలింపు ఆపే శక్తి ఎవరికి లేదు

రాజధాని తరలింపు ఆపే శక్తి ఎవరికి లేదు
అమరావతి ఏప్రిల్ 22
దేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపు వ్యవహారంలో ముందుకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తున్నది. విశాఖలో వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కీలక ప్రకటన ఇందుకు నిదర్శనం.‘విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుంది’ అని ప్రకటించారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జీవోలు క్రమం తప్పకుండా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఎక్కడా ఏదీ ఆపడం లేదని నిరూపించుకుంటున్నది.అదే విధంగా రాజధాని తరలింపు పై కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటనలతో అర్ధం అవుతున్నది. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి రాజధాని తరలింపు  పై హైకోర్టు లో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం సెక్రటేరియట్ ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. విశాఖకు వెళ్లేందుకు సిద్ధం కావాలని ఉద్యోగులకు సూచనలిస్తోందని పిటిషన్ లో తెలిపారు.
=========

Related Posts